మరుథుర్ గోపాలన్ రామచంద్రన్(ఎమ్జీఆర్).. తమిళ ప్రజల ఆరాధ్య నేత. 10ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించి.. చరిత్రలో చెరగని ముద్ర వేశారు ఆయన. ఇంతటి ప్రాముఖ్యం ఉండటం వల్లే.. రాష్ట్రంలో జరిగే ఏ ఎన్నికల్లోనైనా ఆయన ప్రస్తావన కచ్చితంగా ఉంటుంది. 2021 అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా పూర్తిగా ప్రచారాలు ప్రారంభమవ్వకముందే... ఎమ్జీఆర్ పేరు రాష్ట్రవ్యాప్తంగా మారుమోగిపోతోంది. సూపర్‌స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్‌తో పాటు భాజపా నేతలు ఆయనను తమ 'సొంత మనిషి'ని చేసుకునేందుకు పోటీపడుతున్నారు.
గెలుపోటములు పక్కనపెడితే.. ఎమ్జీఆర్ అస్త్రం వల్ల అధికార అన్నాడీఎంకే ఓట్లు చీలిపోయే ప్రమాదం ఎక్కువగా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ప్రజలపై ఆయా పార్టీలు విసురుతున్న 'ఎమ్జీఆర్' అస్త్రం ఫలిస్తుందా? అసలు ఇది ప్రజలపై ఎంత ప్రభావం చూపుతుంది?
'స్థానికం' కోసం భాజపా..
భాజపాకు ఈ ఎన్నికలు ఎంతో ముఖ్యం. దేశవ్యాప్తంగా జెండా ఎగరేసినా.. తమిళ రాష్ట్రంలో మాత్రం అనేకమార్లు తక్కువ స్థానాలకే పరిమితమైంది. భాజపాపై అక్కడ ఇప్పటికీ 'విదేశీ' ముద్రే ఉంది. ఈసారి ఎలాగైనా దానిని తొలగించి.. 'స్థానిక' ముద్ర వేసుకోవాలని తీవ్రంగా శ్రమిస్తోంది. ఇందుకు కమలదళం ఉపయోగించిన అస్త్రం కూడా 'ఎమ్జీఆర్'యే.
ఇదీ చూడండి:-డీఎంకే ఎన్నికల ప్రచార నినాదం ఇదే..
గత కొన్ని నెలలుగా ఎమ్జీఆర్ పేరును విపరీతంగా ప్రస్తావిస్తోంది భాజపా. ఇటీవలే ముగిసిన 'వేల్ యాత్ర'తో పాటు అనేక ప్రచారాల్లో ఆయన పట్ల తన భక్తిని ప్రదర్శిచింది. ఎమ్జీఆర్ ఏ ఒక్క పార్టీకి చెందిన వారు కాదని.. ఆయన ప్రజల ఆస్తి అన్నది కమలదళం వాదన.
"ఎమ్జీఆర్ మహిళల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఇదే వైఖరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీలోనూ కనిపిస్తుంది. మహిళల అభివృద్ధికి మోదీ చాలా కార్యక్రమాలు చేపట్టారు. ఎమ్జీఆర్‌కు భారతరత్న ఇచ్చారు. ఆయన ఇక ఏ పార్టీకి చెందిన ప్రైవేటు ఆస్తి కాదు. ఆయన ప్రజల ఆస్తి."
-- వనతి శ్రీనివాసన్, భాజపా మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు.
పార్టీ ప్రకటనకు ముందే..
రాజకీయాల్లోకి ప్రవేశించాలనుకున్న ఏ నటుడికైనా ఎమ్జీఆర్ ఆదర్శం. ఆయన సినీ జీవితం నుంచి స్ఫూర్తి పొంది ఎదిగిన వారెందరో.. ఎమ్జీఆర్ మార్గంలో నడుద్దామనుకుంటారు. రజనీ, కమల్‌హాసన్ ఇలాంటి వారే.
అయితే రజనీకాంత్ మరో అడుగు ముందుకేసి.. 2018లోనే ఎమ్జీఆర్ను ప్రస్తావించారు. ఎమ్జీఆర్లాగా మంచి పాలన అందించడమే తన లక్ష్యమని చెప్పారు.