మరికొద్ది రోజుల్లో పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. పెళ్లికుమారుడు సహా అతడి ఇద్దరి సోదరీమణులు.. అనుమానాస్పద రీతిలో సజీవదహనమయ్యారు. బంగాల్లోని దుర్గాపుర్లో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఈ విషాద ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. మృతులను మంగళ్ సోరెన్ (33), సుమీ సోరెన్ (35), బహమనీ సోరెన్ (23)గా గుర్తించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. దుర్గాపుర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న హఫ్నా సోరెన్ కుమారుడు మంగళ్ సోరన్కు ఇటీవలే వివాహం నిశ్చయమైంది. ఆదివారం.. వధువు తరఫున కుటుంబసభ్యులు మంగళ్ ఇంటికి వచ్చి వివాహానికి ముహుర్తం ఖరారు చేయాల్సి ఉంది. అందుకు మంగళ్ సోదరమణులు సుమీ, బహమనీ.. శుక్రవారం పుట్టింటికి వచ్చారు. సుమీ సోరెన్ కోల్‌కతాలో నర్సుగా పనిచేస్తుండగా.. బమమనీ గృహిణి. అయితే వీరి తండ్రి శనివారం తెల్లవారుజామున ఏదోపని మీద మార్కెట్కు వెళ్లాడు. అతడు తిరిగి వచ్చే చూడగా ఇంటికి తాళం వేసి ఉంది. ఇంటి నుంచి మంటలు రావడం గమనించాడు. వెంటనే తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్లగా.. కుమారుడు, ఇద్దరు కూమార్తెలు విగతజీవులుగా పడి ఉన్నారు.
వెంటనే అతడు పోలీసులకు సమాచారం అందించాడు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. ముగ్గురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. తీవ్రమైన కాలిన గాయాలతో మంగళ్ సోరెన్ అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి సోదరీమణులను దుర్గాపుర్ జిల్లా ఆస్పత్రికి తరలించగా.. వారు అప్పటికే చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. వివాహం జరిగాల్సిన ఇంట్లో ఈ ఘటన జరగడం వల్ల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.