Charminar Express Derailed at Nampally : నాంపల్లి రైల్వేస్టేషన్‌లో పెనుప్రమాదం తప్పింది. ఈ ఉదయం 8 గంటల 40 నిమిషాలకు చెన్నె నుంచి హైదరాబాద్ వచ్చిన చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్ మీదుగా నాంపల్లి రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. సికింద్రాబాద్‌లోనే చాలా వరకు ప్రయాణికులు దిగిపోగా, మిగిలిన వారితో చివరి స్టేషన్ అయిన నాంపల్లికి వచ్చింది. స్టేషన్‌లో ఐదో ప్లాట్‌ఫాంపైకి వచ్చిన రైలు, ఆగే సమయంలో అక్కడి డెడ్ ఎండ్ వాల్‌ను ఢీకొట్టింది.
Train Accident at Nampally Hyderabad :ఈ క్రమంలో ఒక్కసారిగా రైలు కుదుపునకు గురికాగా, మూడు బోగీలు ఎస్ 2, ఎస్ 3, ఎస్ 6 పట్టాలు తప్పి పాక్షికంగా దెబ్బతిన్నాయి. సికింద్రాబాద్‌లోనే ప్రయాణికులు చాలా వరకు దిగిపోగా, మిగిలిన వారు నాంపల్లిలో దిగేందుకు డోర్‌ల వద్దకు చేరుకుంటుండగానే ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో ఆరుగురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. అందులో ఒకరికి తీవ్ర గాయాలు అయినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిని లాలాగుడాలోని రైల్వే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా వీరికి రూ.50 వేలు ఎక్స్‌గ్రేషియా కూడా అందించినట్లు ప్రాథమిక సమాచారం. క్షతగాత్రుల బంధువులు కూడా ఆసుపత్రికి చేరుకొని యోగక్షేమాలు తెలుసుకున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న రైల్వే అధికారులు నాంపల్లి స్టేషన్‌కు చేరుకుని విచారణ చేపట్టారు. ఓవర్ స్పీడ్‌తో డెడ్ ఎండ్‌ను ఢీకొట్టడం వల్ల ఈప్రమాదం జరిగిందని రైల్వే సీపీఆర్వో రాకేశ్ తెలిపారు.
'చెన్నై నుంచి వస్తున్న చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌కి నాంపల్లి స్టేషన్ చివరిది. చివరి స్టాప్ కొంచెం స్పీడ్‌లో ఉండడంతో వాల్‌ను ఢీ కొనడం జరిగింది. దీంతో ఎస్2, ఎస్3, ఎస్6 మూడు బోగీలు దెబ్బతిన్నాయి. ఈ ట్రైన్ వాకింగ్ స్పీడ్‌లో ఉండడంతో దాని ప్రభావం అంతగా లేదు. చివరి స్టేషన్ కావడంతో దిగుదామని ప్రయాణికులు తలుపు దగ్గర ఉండడంతో వారికి కొంచెం గాయాలయ్యాయి. ఆరుగురు ప్రయాణికులకు గాయాలు కాగా, వారికి మా ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తున్నాం. మిగతా ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేదు.' -రాకేశ్, రైల్వే సీపీఆర్వో