Chenchus life style in Nallamala : సమాజానికి దూరంగా అమ్రాబాద్ అటవీ ప్రాంతం లోతట్టున ఉన్న చెంచులను ఆదుకుంటూ, వారి కనీస అవసరాలు తీర్చేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయి. ఆర్డీటీ, లయన్స్ క్లబ్, కోనేరు లాంటి సంస్థలు వివిధ రకాలుగా సేవలందిస్తున్నాయి. మానవతా దృక్పథం గల కొందరు వ్యక్తులు సమూహంగా, వ్యక్తిగతంగా చెంచులకు దుస్తులు, దుప్పట్లు, నిత్యావసర సరకులు, గృహోపకరణాలు సమకూర్చి ఆదుకుంటున్నారు.
Nallamala Chenchus life style : ఇదే కోవలో 'లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్'.. సనత్‌నగర్ సమన్వయకర్త కళ్లెం శ్రీనివాస్ రెడ్డి నల్లమలలోని చెంచులకు వంటసామగ్రి, దుప్పట్లు, పిల్లలకు ఆటవస్తువులు అందించేందుకు ముందుకొచ్చారు. 'నల్లమల అడవిలో ఒకరోజు' పేరిట జనవరి నుంచి 2 నెలలకో చెంచుపెంటకు వెళ్తున్నారు. ఒక్కో కుటుంబానికి 4 వేల విలువైన వంట సామగ్రి అందిస్తున్నారు. ఇప్పటివరకు మల్లాపూర్, పుల్లాయిపల్లి చెంచుపెంటలో నిర్వహించిన శిబిరాల్లో 40కుటుంబాలకు విద్యుత్తు ఉద్యోగులు, టైపిస్ట్ ఉద్యోగులు సాయం అందించారు.
"మేము చేసే కార్యక్రమాలన్నీ ముందుగా నిర్ణయించుకుంటాం. వాట్స్ప్లో ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని కార్యక్రమానికి సంబందించి ఖర్చులు, సామన్లు కొనుగోలు ఇలా ప్రతి ఒక్కటి అందులోనే చర్చించుకుంటాం. ఈ కార్యక్రమానికి ఉద్యోగులు స్వచ్ఛందంగా డబ్బులు ఇస్తుంటారు. ఆ డబ్బులతో అడవి బిడ్డల కనీస అవసరాలు తీర్చుతాం".- కళ్లెం శ్రీనివాస్ రెడ్డి, సహాయ గణాంకాధికారి విద్యుత్తు శాఖ
Nallamala Chenchus life style in Telangana : 'లయన్స్ క్లబ్ సనత్‌నగర్' సహకారంతో లింగాల మండలం రాంపూర్ పెంటలో 25 చెంచు కుటుంబాలకు వంట సామగ్రి, దుస్తుల పంపిణీ చేశారు. అమ్రాబాద్ ఎస్ఐ వీరబాబు గతంలో విద్యుత్తు విజిలెన్స్ విభాగంలో పనిచేయడం వల్ల.. కళ్లెం శ్రీనివాస్ రెడ్డితో పరిచయం ఉంది. విద్యుత్తు శాఖలో పనిచేసే శ్రీనివాస రెడ్డి.. వేతనం నుంచి 20శాతం సమాజ సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తున్నారు.