అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోదీని ఇరికించేందుకు కాంగ్రెస్ పార్టీ దివంగత నేత అహ్మద్ పటేల్ కుట్రపన్నారని, ఆ కుట్రలో ప్రముఖ సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ భాగమయ్యారని గుజరాత్ పోలీసులు తమ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఈ కారణం చెప్తూ.. ఆమె బెయిల్ దరఖాస్తును వ్యతిరేకించారు. 2002 గుజరాత్ అల్లర్ల కేసుకు సంబంధించి కల్పిత సాక్ష్యాలు, తప్పుడు సమాచారం ఆరోపణలపై పోలీసు శాఖకు చెందిన సిట్ దర్యాప్తు జరుపుతోంది. ఆ కేసులో తీస్తా ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ క్రమంలో కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో సిట్ కీలక విషయాలు వెల్లడించింది.
2002 గుజరాత్ అల్లర్ల తర్వాత రాష్ట్రంలోని భాజపా ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు దివంగత కాంగ్రెస్ కురువృద్ధుడు అహ్మద్ పటేల్ ఆదేశాల మేరకు జరిగిన పెద్ద కుట్రలో తీస్తా భాగమని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సెషన్స్ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. మోదీతో సహా ఇతర అధికారులు, అమాయక ప్రజలను ఇరికించినందుకు గానూ ఆమె చట్టవిరుద్ధమైన ఆర్ధిక ప్రయోజనాలు పొందినట్లు దానిలో వెల్లడించింది. అలాగే గుజరాత్‌లోని భాజపా సీనియర్ నేతల పేర్లను ఈ కుట్రలో చేర్చేందుకు దిల్లీలో అప్పట్లో అధికారంలో ఉన్న ఓ ప్రముఖ జాతీయ పార్టీ నేతలను కలిసేవారని పేర్కొంది. పలువురు సాక్షుల వాంగ్మూలాలను ఉటంకిస్తూ.. అఫిడవిట్‌లో ఈ వాదనలను చేర్చింది. ఓ సాక్షిని ఉద్దేశించి 2006లో ఒక కాంగ్రెస్ నేతతో సీతల్వాద్ మాట్లాడిన మాటలను ప్రస్తావించింది. కాంగ్రెస్ పార్టీ షబానా, జావెద్‌లకు మాత్రమే ఎందుకు అవకాశం ఇస్తోందని, తననెందుకు రాజ్యసభకు పంపడం లేదని తీస్తా అడిగినట్లు ఆ సాక్షిని ఉటంకిస్తూ పేర్కొంది.
మాటల యుద్ధం..
సిట్ అఫిడవిట్ నేపథ్యంలో భాజపా, కాంగ్రెస్ మధ్య మాటలయుద్ధం మొదలైంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీనే.. అహ్మద్ పటేల్ వెనుక ఉండి ఇదంతా నడిపించారని.. భాజపా అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ఆరోపించారు. మరోవైపు.. దీనిని కాంగ్రెస్ ఖండించింది. ఈ ఆరోపణలు కుట్రపూరితమైనవని బదులిచ్చింది.
"సిట్ దాఖలు చేసిన అఫిడవిట్‌తో నిజాలు బయటపడ్డాయి. ఎవరు ఎవరిపై కుట్ర పన్నారో తెలిసింది. ఈ కుట్రలో అహ్మద్ పటేల్ పాత్ర కేవలం నామమాత్రమే. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆయన వెనుక ఉండి ఇదంతా నడిపించారు. గుజరాత్, మోదీల ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నించారు."
-సంబిత్ పాత్ర, భాజపా అధికార ప్రతినిధి
కాంగ్రెస్ దివంగత నేత అహ్మద్ పటేల్‌పై సిట్ చేసిన వాదనలను శనివారం.. కాంగ్రెస్ పార్టీ తోసిపుచ్చింది. మరణించిన వారినీ వదలడం లేదని విరుచుకుపడింది. రాజకీయ పెద్దలు ఆడించినట్లుగా సిట్ ఆడుతోందని, వారు ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటోందని విమర్శించింది.
'దివంగత అహ్మద్ పటేల్‌పై చేసిన ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. 2002లో మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన మారణహోమంతో తనపై వచ్చిన ఆరోపణల నుంచి క్రమంగా బయటపడేలా ప్రధాని నడుపుతోన్న వ్యూహంలో ఇది ఒక భాగం. ఈ ఘటన అప్పటి భాజపా అగ్రనేత, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ.. మోదీకి రాజధర్మాన్ని గుర్తుచేసేలా చేసింది. ప్రధాన మంత్రి రాజకీయ ప్రతీకారంతో దివంగతులైన ప్రత్యర్థులను కూడా విడిచిపెట్టడం లేదు. సిట్ తన రాజకీయ పెద్దలు ఆడించినట్లు ఆడుతోంది. ఇంతకు ముందు సిట్ చీఫ్ అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రికి క్లీన్ చిట్ ఇవ్వగా.. తర్వాత ఆయనకు దౌత్య పరమైన బాధ్యతలు ఎలా వచ్చాయో మాకు తెలుసు. పత్రికల ద్వారా, కీలుబొమ్మల్లాంటి దర్యాప్తు సంస్థల ద్వారా ప్రచారం చేయించడం మోదీ-షా కొన్నేళ్లుగా అనుసరిస్తున్న వ్యూహం' అని దీనిపై తీవ్రంగా స్పందించింది.
అలాగే పటేల్ కుమార్తె కూడా తాజా ఆరోపణలను కొట్టిపారేశారు. ఇంతటి పెద్ద కుట్రలో తన తండ్రి భాగమైతే.. 2020 వరకు కేంద్రం ఆయన్ను ఎందుకు విచారించలేదని సూటిగా ప్రశ్నించారు. అహ్మద్ పటేల్ 2020లో మరణించారు.
2002 గుజరాత్ అల్లర్ల కేసులో ప్రస్తుత ప్రధాని, అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి మోదీ సహా 62 మందికి ప్రత్యేక దర్యాప్తు బృందం క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ఇటీవల సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆ అల్లర్ల వెనుక భారీ కుట్ర కోణం ఉందని, పునర్విచారణ జరిపించాలని కోరుతూ నాటి ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన కాంగ్రెస్ దివంగత ఎంపీ ఎహ్‌సాన్ జాఫ్రీ భార్య జాకియా జాఫ్రీ వేసిన పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. ఆ సందర్భంగా 'ఆ ఘటనపై నిత్యం వివాదం రగులుతూ ఉండేలా 2006 నుంచి దురుద్దేశపూర్వకంగా పిటిషన్లు వేసినట్లు స్పష్టమవుతోంది. విచారణ ప్రక్రియ దుర్వినియోగంలో భాగస్వాములైనవారందరిపై చట్ట ప్రకారం చర్యలు చేపట్టాలి' అంటూ ఘాటుగా స్పందించింది. కోర్టు స్పందన వచ్చిన మరుసటి రోజే.. అమాయకులను ఇరికించేందుకు కుట్ర పన్నారంటూ తీస్తా సెతల్వాద్, గుజరాత్ మాజీ డీజీపీ ఆర్‌బీ శ్రీ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కాగా ప్రస్తుత అఫిడవిట్‌ను పరిగణనలోకి తీసుకున్న సెషన్స్ కోర్టు తీస్తా బెయిల్ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టనుంది.
ఇదీ చూడండి :భారీగా హెరాయిన్ సీజ్.. సోప్ బాక్సుల్లో, డీజిల్ ట్యాంక్‌లో.. విలువ రూ.450 కోట్లకుపైనే..