పంజాబ్ కొత్త సీఎంగా(Punjab New CM) చరణ్‌జీత్ సింగ్ చన్నీని(Charanjit Singh Channi) కాంగ్రెస్ పార్టీ నియమించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నేత, పంజాబ్ ఇన్ఛార్జ్ హరీశ్ రావత్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. చరణ్‌జీత్ చన్నీ ఏకగ్రీవంగా ఎంపికైనట్లు తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటలకు ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు.
అంతకుముందు సుఖ్జిందర్ సింగ్ రంధావాను సీఎంగా(Punjab CM News) ఖరారుగా చేశారని వార్తలొచ్చాయి. కానీ రావత్ ట్వీట్‌తో సందిగ్ధం వీడింది. పంజాబ్ సీఎంగా ఈసారి ఎస్సీ నేతకు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ అధిష్ఠానం. చరణ్‌జీత్ ప్రస్తుతం సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు.
కెప్టెన్ అభినందనలు..
సీఎంగా చరణ్‌జీత్ సింగ్ ఎంపికను పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ స్వాగతించారు. సరిహద్దు భద్రత సవాళ్లను ఆయన సమర్థంగా ఎదుర్కొని రాష్ట్రాన్ని సురక్షితంగా ఉంచుతారని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు.
చన్నీకి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను పార్టీ తప్పక నెరవేర్చాలని అన్నారు. ప్రజల నమ్మకమే పార్టీకి అత్యంత ప్రాధాన్యం కావాలని అన్నారు.
తొలి దళిత సీఎం
పంజాబ్‌కు తొలి దళిత ముఖ్యమంత్రి (Punjab first dalit CM) చన్నీనే కావడం గమనార్హం. ఆయన రామదాసియా సిక్కు వర్గానికి చెందినవారు. చామకౌర్ సాహిబ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వరుసగా మూడు సార్లు అక్కడి నుంచే గెలుపొందారు. 2017 మార్చిలో అమరీందర్ సింగ్ కేబినెట్లో చోటు దక్కించుకున్నారు.
అమరీందర్ సింగ్‌పై అసంతృప్తి వ్యక్తం చేసిన నలుగురు మంత్రుల్లో చన్నీ ఒకరు. నవజ్యోత్ సింగ్ సిద్ధూకు అత్యంత సన్నిహితుడిగా చన్నీకి పేరుంది. 2002లో ఖరార్ మున్సిపల్ కౌన్సిల్‌కు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇక్కడితో ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. 2007లో చామకౌర్ సాహిబ్ అసెంబ్లీ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. 2012లో హస్తం పార్టీ తరపున ఇక్కడి నుంచే గెలుపొందారు. అసెంబ్లీలో విపక్ష నేతగానూ పనిచేశారు. అకాలీదళ్‌కు వ్యతిరేకంగా బలంగా పోరాడారు. 2017లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. మంత్రి పదవి దక్కించుకున్నారు.
వివాదాలు ఎన్నో..
తనకు చన్నీ అసభ్య సందేశాలు పంపినట్లు 2018లో ఆయనపై ఓ ఐఏఎస్ మహిళా అధికారి ఆరోపణలు చేశారు. పంజాబ్ మహిళా కమిషన్ వీటిని సుమోటోగా స్వీకరించి ప్రభుత్వానికి నోటీసులు పంపించింది. దీనిపై క్షమాపణలు చెప్పాలని అమరీందర్ సింగ్.. చన్నీకి సూచించారు. ఈ వివాదం ముగిసిపోయినట్లేనని అమరీందర్ ప్రకటించారు. అయితే, ఈ ఏడాది మేలో ఈ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. సమస్యపై ప్రభుత్వ వైఖరి చెప్పకుంటే నిరాహార దీక్షకు దిగుతామని మహిళా ప్యానెల్ చీఫ్ హెచ్చరించారు. ఇది రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు, 2018లో ఓ కళాశాలలో లెక్చరర్ పోస్టుకు అభ్యర్థిని ఎంపిక చేసిన విషయంలోనూ వివాదంలో చిక్కుకున్నారు చన్నీ. ఓ నాణెం ఎగురవేసి.. ఇద్దరు అభ్యర్థుల్లో ఒకరిని ఎంపిక చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు రావడం.. వివాదాస్పదమైంది.
వ్యక్తిగత వివరాలు
1963 మార్చి 1న జన్మించారు చరణ్‌జీత్ సింగ్ చన్నీ. మొహాలీ ఖరార్‌లో నివాసం ఉంటున్నారు. పోస్ట్ గ్రాడ్యూయేషన్ పూర్తి చేశారు. ఛండీగఢ్ పంజాబ్ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ పట్టా అందుకున్నారు. ఆయన మంచి హ్యాండ్ బాల్ ప్లేయర్ కూడా. యూనివర్సిటీ స్థాయిలో మూడు సార్లు గోల్డ్ మెడల్ సాధించారు. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వంటి సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు.
అమరీందర్ రాజీనామా
పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి కెప్టెన్ అమరీందర్ సింగ్.. శనివారం రాజీనామా చేశారు. పార్టీలో అవమానం భరించలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. భవిష్యత్ కార్యాచరణపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.