బిహార్లో కల్తీ మద్యానికి బలయ్యే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఛాప్రా జిల్లాతో పాటు సరన్, సివాన్, బెగుసరాయ్ జిల్లాల్లోనూ కల్తీ మద్యం బారిన పడి పలువురు మరణించారు. ఫలితంగా ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 73కు పెరిగింది. మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకొని పరీక్షలకు తరలించారు.
మరోవైపు, ఈ కల్తీ మద్యం ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కల్తీ మద్యం పోలీస్ స్టేషన్ల నుంచే బయటకు వెళ్లిందని సమాచారం. బిహార్లోని ఎక్సైజ్ శాఖ భారీ మోతాదులో కల్తీ మద్యాన్ని తయారు చేసే పదార్థాలను స్వాధీనం చేసుకుని.. ధ్వంసం చేసేందుకని మష్రక్ పోలీస్ స్టేషన్లో ఉంచింది. అయితే, డ్రముల్లో ఉంచిన కల్తీ మద్యం అదృశ్యం అయినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇది కచ్చితంగా పోలీస్ స్టేషన్లోని సిబ్బంది నిర్వకమే అని పలువురు విమర్శిస్తున్నారు. కాగా, చికిత్స పొందుతున్న బాధితులు.. తాము మద్యాన్ని మష్రక్ మార్కెట్ నుంచే కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. కల్తీ మద్యం కేసులో 48 గంటల్లో 213 మందిని అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. బాధితుల్లో 25 మంది కంటిచూపు కోల్పోయారని చెప్పారు. మృతుల్లో 30 మందికి శవపరీక్షలు జరిగాయని తెలిపారు.