పంజాబ్ నూతన ముఖ్యమంత్రిగా(punjab cm name) ప్రమాణ స్వీకారం చేశారు సిక్కు-దళిత నాయకుడు చరణ్‌జీత్ సింగ్ చన్నీ. రాష్ట్ర చరిత్రలో దళిత వర్గానికి చెందిన తొలి సీఎంగా గుర్తింపు పొందారు. 58 ఏళ్ల చన్నీ.. బహుముఖ ప్రజ్ఞాశాలి, ఉన్నత విద్యావంతుడు, క్రీడల పట్ల ఆసక్తి ఉన్న వ్యక్తి. ఆయన జ్యోతిష శాస్త్రాన్ని బలంగా నమ్ముతారు.
కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేసిన క్రమంలో తదుపరి ముఖ్యమంత్రిగా చరణ్‌జీత్ సింగ్‌ను(Charanjit singh channi) కాంగ్రెస్ అధిష్ఠానం ఎంపిక చేసింది. కొద్ది నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలే (punjab assembly elections) లక్ష్యంగా చన్నీకి సీఎం పదవి కట్టబెట్టినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
బాల్యం, విద్యాభ్యాసం..
పంజాబ్ సాహిబ్జాదా అజిత్ సింగ్ నగర్ జిల్లాలోని భాజులి గ్రామంలో 1963, మార్చి 1న జన్మించారు చరణ్‌జీత్ సింగ్ చన్నీ. ఖరార్‌లోని ఖాల్సా సీనియర్ సెకండరీ పాఠశాలలో చదివారు. ఆ సమయంలోనే ఆయన రాజకీయ జీవితానికి బీజం పడిందని చెప్పాలి. విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా సేవలందించారు. ఛండీగఢ్‌లోని శ్రీ గురు గోవింద్ సింగ్ కళాశాలలో డిగ్రీ పట్టా పొందారు. డిగ్రీ కళాశాలలోనూ స్టూడెంట్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. పీజీలో రెండు డిగ్రీలు సాధించారు. ఒకటి బిజినెస్ అడ్మినిస్ట్రేటర్, మరొకటి పొలిటికల్ సైన్స్‌లో పూర్తి చేశారు.
కౌన్సిలర్‌గా ఎన్నికైన సమయంలోనే పంజాబ్ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు చన్నీ. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత.. పంజాబ్ సాంకేతిక విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. ప్రస్తుతం పంజాబ్ వర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్ విభాగంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌పై పీహెచ్డీ చేస్తున్నట్లు సమాచారం.
రాజకీయ ప్రస్థానం..
మున్సిపల్ కౌన్సిలర్‌గా ఎన్నికై.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు చన్నీ. వరుసగా మూడు సార్లు విజయం సాధించారు. ఖరార్ మున్సిపల్ కౌన్సిల్‌కు రెండు సార్లు అధ్యక్షుడిగా సేవలందించారు. 2007లో, ఛంకౌర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తొలిసారి ఎన్నికల బరిలో స్వతంత్ర అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థిపై పోటీ చేశారు చన్నీ. మూడేళ్ల తర్వాత కెప్టెన్ అమరీందర్ సింగ్.. ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు.
ఆ తర్వాత 2012, 2017లో జరిగిన ఎన్నికల్లో విజయ దుందుభి మోగించారు. 2016లో కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగానూ(సీఎల్పీ) సేవలందించారు.