Chandrayaan 3 Sleep Mode :ఆగస్టు 23న జాబిల్లిపైకి చేరిన చంద్రయాన్-3 ల్యాండర్, రోవర్ చురుగ్గా తమ పనిని పూర్తి చేస్తున్నాయి. రోవర్ జాబిల్లిపై తిరుగుతూ పరిశోధనలు చేస్తుంటే... అది విశ్లేషించిన మొత్తం సమాచారాన్ని ల్యాండర్ భూమిపైన ఇస్రో డేటా కేంద్రానికి చేరవేస్తోంది. ఇన్నాళ్లూ మనకి తెలియని ఎన్నో కొత్త విషయాలను ప్రజ్ఞాన్ రోవర్ అధ్యయనంలో తెలిశాయి. చంద్రుడిపై సల్పర్, అల్యూమినియం, కాల్షియం, ఇనుము, క్రోమియం, టైటానియం, సిలికాన్, మాంగనీస్, ఆక్సిజన్ మూలకాలను ప్రజ్ఞాన్ రోవర్ గుర్తించింది. చంద్రుడిపై సల్ఫర్ ఉన్నట్లు రోవర్‌లోని LIBS పరికరంతో పాటు APXS పరికరం కూడా ధ్రువీకరించాయి. అయితే, చంద్రుడిపై సల్ఫర్ ఎలా వచ్చిందో శాస్త్రవేత్తలు తాజా విశ్లేణలను అభివృద్ధి చేయాల్సి వస్తుందని ఇస్రో తెలిపింది. అలాగే చంద్రుడి ఉపరితలంపై ఉన్న ఉష్ణోగ్రతలను రోవర్ భూమికి చేరవేసింది. ఇప్పటివరకు జాబిల్లిపై మన శాస్త్రవేత్తలకు తెలియని.. ఎన్నో అంశాలను రోవర్ గుర్తించింది. ఈ డేటాను ఇస్రో శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు.
Chandrayaan 3 Rover Latest Update :మరోవైపు జాబిల్లిపై రోవర్ సెంచరీ కొట్టిందని తాజాగా ఇస్రో సామాజిక మాధ్యమాల్లో తెలిపింది. ల్యాండర్ నుంచి 100 మీటర్ల దూరం పయనించిందని వివరించింది. చంద్రుడిపై పగటిపూట ల్యాండర్‌ను, రోవర్‌ను దించిన ఇస్రో... 14 రోజుల పగలు పూర్తై చీకటి పడగానే రెండింటిని నిద్రపుచ్చనుంది. జాబిల్లిపై రాత్రిపూట దాదాపు మైనస్ 180 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోతాయి కాబట్టి.. అక్కడ ల్యాండర్, రోవర్ మనుగడ సాధించలేవని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకటి, రెండురోజుల్లో వాటిని నిద్రపుచ్చనున్నట్లు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు.
"రోవర్, ల్యాండర్ ఇంకా పనిచేస్తున్నాయి. సైంటిఫిక్ పరికరాలకు సంబంధించిన మా బృందం చాలా పనిచేస్తోంది. మంచి వార్త ఏమిటంటే రోవర్ ల్యాండర్ నుంచి దాదాపు 100 మీటర్ల దూరం వెళ్లింది. వచ్చే ఒకటి, రెండు రోజుల్లో మేం ఆ రెండింటిని నిద్రపుచ్చే కార్యక్రమాన్ని చేపడతాం. ఎందుకంటే అక్కడ రాత్రి అవుతుంది. భారత్ కోసం బలమైన స్పేస్, మౌలిక వసతులు నిర్మించే ఈ పనిలో మాకు నిరంతరం మద్దతు ఇస్తున్న మీకు అందరికీ మా ధన్యవాదాలు."
--సోమనాథ్, ఇస్రో ఛైర్మన్