Chandrayaan 3 Moon South Pole Temperature :జాబిల్లి దక్షిణ ధ్రువానికి సమీపంలో శాస్త్రీయ పరిశోధనలు చేస్తున్న విక్రమ్ ల్యాండర్ నుంచి తొలి శాస్త్రీయ డేటాను ఇస్రో అందుకుంది. సామాజిక మాధ్యమం Xలో దీన్ని ఇస్రో షేర్ చేసింది. జాబిల్లి ఉపరితలం వద్ద, ఉపరితలానికి సమీపంలో, ఉపరితలం లోపల ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయనే గ్రాఫ్‌ను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ Xలో పోస్ట్ చేసింది. విక్రమ్ ల్యాండర్‌లో ఉన్న చాస్టే పేలోడ్ ద్వారా ఈ శాస్త్రీయ డేటాను సేకరించింది. చంద్రాస్ సర్ఫేస్ థర్మో ఫిజికల్ ఎక్స్‌పెరిమెంట్.. చాస్టే పేలోడ్ చంద్రుడి ఉపరితలంపై ఉష్ణ లక్షణాలను కొలిచింది.
చంద్రుడిపై అత్యధికంగా 70 డిగ్రీల సెల్సియస్‌లు ఉష్ణోగ్రతలు నమోదు..
చంద్రుడి ఉపరితల ఉష్ణోగ్రతలపై చంద్రయాన్ 3 నుంచి వచ్చిన సమాచారంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాము ఊహించిన దాని కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నాయని వెల్లడించారు. చాస్టే పేలోడ్ పంపిన డేటా ప్రకారం.. చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రత సుమారు 50 డిగ్రీలు ఉందని తెలిపారు. చాస్టే పేలోడ్ పరిశోధనల్లో గరిష్ఠంగా 70 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఇస్రో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. తాము 20 నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుందని అంచనా వేసినట్లు తెలిపిన శాస్త్రవేత్తలు.. మొత్తంగా చంద్రుడిపై -10 నుంచి గరిష్ణంగా 70 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలున్నట్లు ప్రకటించారు.
Chaste Chandrayaan 3 :చంద్రుని ఉపరితలం ఉష్ణ ప్రవర్తనను అర్థం చేసుకోవడానికి, దక్షిణ ధ్రువం చుట్టూ ఉన్న ఉపరితలం ఉష్ణోగ్రత ప్రొఫైల్‌ను చాస్టే పేలోడ్ కొలిచినట్లు ఇస్రో వెల్లడించింది. చాస్టే పేలోడ్ పంపిన తొలి డేటా ఇదే. ఈ చాస్టే పేలోడ్‌లో ఉష్ణోగ్రత ప్రోబ్ ఉంటుంది. ఇది ఉపరితలం కింద 10 సెంటీమీటర్ల లోతు వరకు చేరుకోగలదు. చంద్రుని ఉపరితలంలో లోతుకు వెళ్తున్న కొద్ది ఉష్ణోగ్రతలు తగ్గడం ఈ గ్రాఫ్‌లో మనం చూడవచ్చు. మైనస్ 10 డిగ్రీల నుంచి 60 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతల్లో తేడాలు ఈ గ్రాఫ్‌లో పొందుపర్చి ఉన్నాయి.