Chandrayaan 3 Lunar Orbit Injection : జాబిల్లిపై పరిశోధనలకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ- ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 మిషన్‌లో కీలక ఘట్టం ఆవిష్కృతం అయింది. ఈ వ్యోమనౌక జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించింది. ఇందుకు సంబంధించిన లూనార్ ఆర్బిట్ ఇంజెక్షన్ అనే కీలక విన్యాసాన్ని రాత్రి 7 గంటల సమయంలో ఇస్రో చేపట్టింది. ఫలితంగా చంద్రయాన్-3.. జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించింది. మరో 18 రోజులు దీర్ఘవృత్తాకార కక్ష్యల్లో చంద్రుని చుట్టూ తిరగనున్న చంద్రయాన్-3 ఈ నెల 23 సాయంత్రం జాబిల్లిపై అడుగుపెట్టనుంది.
Chandrayaan 3 Lunar Orbit Insertion Maneuver : గత నెల 14న ఎల్‌వీఎం3 ఎం-4 రాకెట్ ద్వారా చంద్రయాన్-3ని భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఆ తర్వాత మూడు వారాల్లో ఐదుసార్లు కక్ష్యను పెంచుతూ భూమికి దూరంగా వ్యోమనౌకను తీసుకెళ్లారు. ఆగస్టు 1న ట్రాన్స్‌లూనార్ ఇంజెక్షన్ అనే కీలక విన్యాసంతో ఈ వ్యోమనౌకను చందమామను చేరుకునే మార్గం లునార్ ట్రాన్స్‌ఫర్ ట్రాజెక్టరీలోకి ప్రవేశపెట్టారు. అలా జాబిల్లి దిశగా పయనించిన వ్యోమనౌకను ఇప్పుడు చంద్రుని కక్ష్యలోకి ఇస్రో ప్రవేశపెట్టింది. మరో 18 రోజుల పాటు దీర్ఘవృత్తాకార కక్ష్యల్లో చంద్రుడి చుట్టూ తిరుగుతూ 100 కిలోమీటర్ల ఎత్తు వరకూ రానున్న చంద్రయాన్ 3 ఈ నెల 23న సాయంత్రం 5 గంటల 47 నిమిషాలకు జాబిల్లిపై దిగనుంది.