తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అంతరిక్ష రంగంలో నూతన అధ్యాయంగా 'చంద్రయాన్‌-3'.. ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు' - చంద్రయాన్ 3 లైవ్

chandrayaan 3 launch live updates
chandrayaan 3 launch live updates

By

Published : Jul 14, 2023, 2:14 PM IST

Updated : Jul 14, 2023, 4:59 PM IST

16:57 July 14

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ- ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 తొలిదశ విజయవంతం కావటం వల్ల శాస్తవేత్తల్లో సంతోషం వ్యక్తమైంది. ల్యాండర్‌, రోవర్‌, ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ను మోసుకుని అత్యంత శక్తిమంతమైన ఎల్‌వీఎం3-ఎం4 రాకెట్‌ నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి ఎగిరింది. సకాలంలో పేలోడ్‌ను మండించి తొలి రెండు దశలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. చంద్రుడి దిశగా వెళ్లేందుకు మధ్యాహ్నం 2.42 గంటలకు మూడోదశ పేలోడ్‌ను మండించారు. మూడు దశలు నిర్ణీత ప్రణాళిక ప్రకారం పూర్తయ్యాయి. స్పేస్‌క్రాఫ్ట్‌ను అవసరమైన ఎత్తుకు చేర్చేందుకు 3దశలను విజయవంతంగా పూర్తి చేసుకొంది. మధ్యాహ్నం 2.54 గంటలకు మూడో దశ ముగిసిందని, జాబిల్లి దిశగా ప్రయాణం మొదలైనట్లు ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ ప్రకటించారు.

"భారత్‌కు కృతజ్ఞతలు. చంద్రుని దిశగా చంద్రయాన్‌-3 ప్రయాణం మొదలైంది. ఎల్‌విఎం3-ఎం4 రాకెట్‌ చంద్రయాన్‌-3 క్రాఫ్ట్‌ను భూమి చుట్టు ఉన్న కక్ష్యలోకి తీసుకెళ్లింది. 170/36,500 కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలోకి చేరింది. చంద్రయాన్‌-3 రాబోయే రోజుల్లో కక్ష్యలో అవసరమైన ప్రక్రియ పూర్తిచేసుకొని గమ్యం దిశగా ప్రయాణించాలని కోరుకుందాం. చంద్రయాన్‌-3 చంద్రుని దిశగా మరింత ముందుకు సాగాలని ఆశిద్దాం. ఆగస్టు 23న సా. 5.47కు సాఫ్ట్‌ల్యాండింగ్‌ జరగనుంది"

--ఎస్‌.సోమ్‌నాథ్‌ ఇస్రో ఛైర్మన్‌

చంద్రయాన్‌-3 నిర్దేశిత కక్ష్యలోకి చేరటానికి ముందు మూడు దశలు విజయవంతం కావటం వల్ల ఇస్రో శాస్త్రవేత్తల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. తమ స్థానాల నుంచి లేచి నిలబడి కరతాళధ్వనులు చేశారు. ఒకరికొకరు కరచాలనం చేసుకున్నారు. ఇస్రో ఛైర్మన్‌ సోమ్‌నాథ్‌.. కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌కు చంద్రయాన్‌-3 రాకెట్‌ నమూనాను బహూకరించారు. ఈ సందర్భంగా ఇస్రో ఛైర్మన్‌ సోమ్‌నాథ్‌ను పలువురు సీనియర్‌ శాస్త్రవేత్తలు, మాజీ ఇస్రో ఛైర్మన్లు అభినందించారు.

చంద్రయాన్‌ 3 విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశించడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. చంద్రయాన్‌ 3.. భారత అంతరిక్ష రంగంలో నూతన అధ్యాయాన్ని లిఖించిందని పేర్కొన్నారు. చంద్రయాన్‌ 3 ప్రతీ భారతీయుడి కలలను, ఆశయాలను ఉన్నతంగా ఎగరవేస్తుందనివివరించారు. ఈ మహత్తర విజయం.. భారత శాస్త్రవేత్తల నిర్విరామ అంకితభావానికి నిదర్శనమని ప్రధాని అన్నారు. ఇస్రో శాస్త్రవేత్తల స్ఫూర్తికి, చాతుర్యానికి వందనం చేస్తున్నానంటూ మోదీ ట్విటర్‌లో అభినందనలు తెలియజేశారు.

చంద్రయాన్-3 విజయవంతంగా ప్రయోగించిన భారత్.. అంతరిక్ష పరిశోధనలో మరో కీలక మైలురాయిని చేరిందని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈ కీలక విజయం కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన ఇస్రో శాస్త్రవేత్తల బృందానికి హృదయ పూర్వకంగా అభినందనలు తెలియచేస్తున్నానని ట్వీట్​ చేశారు.

15:50 July 14

ఇస్రో శాస్త్రవేత్తలను భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అభినందించారు. "అంతరిక్ష పరిశోధనలో భాగంగా భారత్​.. మరో ముఖ్యమైన మైలురాయిని విజయవంతంగా ప్రయోగించింది. చంద్రయాన్​-3 అంతరిక్ష శాస్త్రం, సాంకేతికతలో దేశ తిరుగులేని నిబద్ధతను ప్రదర్శిస్తుంది. విజయానికి ఇవే నా శుభాకాంక్షలు" అంటూ ట్వీట్​ చేశారు. మరోవైపు, ఇస్రో శాస్త్రవేత్తలకు కేంద్ర హోం మంత్రి అమిత్​ షా కూడా అభినందనులు తెలిపారు.

15:34 July 14

  • దేశం గర్వించదగిన రోజు ఇది: కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌
  • దేశ సాంకేతిక అభివృద్ధికి ఇది తార్కాణం: జితేంద్ర సింగ్‌
  • చరిత్రాత్మక ఘట్టంలో భాగస్వామ్యమయ్యాం: జితేంద్ర సింగ్‌
  • దేశం గర్వపడేలా చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు ధన్యవాదాలు: జితేంద్ర సింగ్‌
  • ఇస్రో శక్తిసామర్థ్యాలను పెంచిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు: జితేంద్ర సింగ్‌

15:18 July 14

చంద్రయాన్​-3 నింగిలోకి దూసుకెళ్లిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ.. ఇస్రో శాస్త్రవేత్రలకు అభినందనలు తెలిపారు. భారత అంతరిక్ష చరిత్రలో చంద్రయాన్​-3 సరికొత్త అధ్యాయాన్ని లిఖించిందని కొనియాడారు. చంద్రయాన్​-3 ప్రతి భారతీయుడి కలలు, ఆశయాలను ఉన్నతంగా ఎగురవేస్తుందని ఆకాంక్షించారు. ఈ మహత్తర విజయం.. శాస్త్రవేత్తల అంకితభావానికి నిదర్శనమని ప్రశంసించారు. ఇస్రో శాస్త్రవేత్తల స్ఫూర్తి, చాతుర్యానికి నమస్కరిస్తున్నట్లు ట్వీట్​ చేశారు.

15:10 July 14

చంద్రయాన్‌-3 విజయవంతంగా కక్ష్యలోకి చేరిన సందర్భంగా ఇస్రో ఛైర్మన్‌ సోమ్‌నాథ్‌ హర్షం వ్యక్తం చేశారు. చంద్రయాన్​-3 చంద్రుడి వైపు తన ప్రయాణాన్ని ప్రారంభించిందని సోమనాథ్​ తెలిపారు. LVM 3-M4 రాకెట్.. చంద్రయాన్ 3ని నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టిందని వెల్లడించారు.

14:54 July 14

ఇస్రో శాస్త్రవేత్తల సంబరాలు

జాబిల్లిపై అన్వేషణ కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చేపట్టిన అత్యంత ప్రతిష్ఠాత్మకమైన చంద్రయాన్‌-3 విజయవంతంగా కక్ష్యలోకి చేరింది. ఈ మధ్యాహ్నం 2.35 గంటలకు తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్‌ రెండో ప్రయోగ వేదిక నుంచి ఎల్‌వీఎం-3 ఎం4 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. ల్యాండర్‌, రోవర్‌, ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ను మోసుకుని ఈ అత్యంత శక్తిమంతమైన రాకెట్‌ జాబిల్లి వద్దకు బయల్దేరింది. ఈ రాకెట్‌ చంద్రయాన్‌-3ని నిర్దేశిత కక్ష్యలో విజయవతంగా ప్రవేశపెట్టింది. ఎల్‌వీఎం-3 ఎం4 నుంచి ఈ ఉపగ్రహం విజయవంతంగా విడిపోయింది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. శాస్త్రవేత్తలు ఒకరినొకరు అభినందనలు తెలుపుకున్నారు.

14:35 July 14

జాబిల్లి అన్వేషణకు చంద్రయాన్-3 బయల్దేరింది. 140 కోట్ల మంది భారతీయుల ఆశలను మోస్తూ చంద్రయాన్-3 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. బాహుబలి రాకెట్​గా పేరొందిన ఎల్​వీఎం-3 ఎం4.. చంద్రయాన్-3ని అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ ఈ ప్రతిష్టాత్మక ప్రయోగానికి వేదికైంది. సరిగ్గా శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటల 13 సెకన్లకు రాకెట్​ను ఇస్రో ప్రయోగించింది. ల్యాండర్, రోవర్, ప్రొపల్షన్ మాడ్యూల్​లతో కూడిన చంద్రయాన్-3.. ఆగస్టులో జాబిల్లిని చేరుకోనుంది.

14:08 July 14

చంద్రయాన్-3 అప్డేట్స్​

చంద్రయాన్-3 ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. మరికొద్ది క్షణాల్లో బాహుబలి రాకెట్.. చంద్రయాన్-3ని నింగిలోకి మోసుకెళ్లనుంది. మధ్యాహ్నం 2.35 గంటలకు రాకెట్​ను ప్రయోగించనున్నారు. ఈ నేపథ్యంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)ను కీర్తిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలను చంద్రయాన్-3 మిషన్ మోసుకెళ్తుందని అన్నారు. భారత అంతరిక్ష రంగంలో 2023 జులై 14వ తేదీ ఎప్పటికీ నిలిచిపోతుందని అన్నారు. ఈ సందర్భంగా భారత శాస్త్రవేత్తలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

"అంతరిక్ష రంగంలో భారత్​కు ఘన చరిత్ర ఉంది. చంద్రుడిపై నీటి జాడను కనిపెట్టిన చంద్రయాన్-1కు అంతర్జాతీయ లూనార్ మిషన్లలో విశేషమైన స్థానం ఉంది. 200కు పైగా శాస్త్రీయ పబ్లికేషన్లు ఈ విషయాన్ని ప్రచురించాయి. చంద్రయాన్-2 సైతం అదే స్థాయిలో కీలకమైన సమాచారం పంపించింది. రిమోట్ సెన్సింగ్ ద్వారా చంద్రుడిపై క్రోమియం, మాంగనీస్, సోడియం ఆనవాళ్లను చంద్రయాన్-2 ఆర్బిటార్ గుర్తించింది."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

Last Updated : Jul 14, 2023, 4:59 PM IST

ABOUT THE AUTHOR

...view details