Chandrayaan 3 launch date : జాబిల్లిపై అన్వేషణకు చంద్రయాన్ 3 ప్రయోగాన్ని ఈ నెల 13న చేపట్టనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రకటించింది. ఈ సారి చంద్రుడిపై ల్యాండర్‌ను కచ్చితంగా దించుతామనే విశ్వాసం ఉన్నట్లు ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమ్‌నాథ్ తెలిపారు. జూలై 13 నుంచి 19 వరకు లాంఛ్ విండో అందుబాటులో ఉందన్న సోమ్‌నాథ్.. తొలి రోజే ప్రయోగం చేపడతామని వివరించారు. GSLV M-3 వాహకనౌక ద్వారా ప్రయోగం చేపట్టనున్నట్లు వెల్లడించారు. ల్యాండర్‌తో పాటు రోవర్‌తో దీన్ని ప్రయోగించనున్నారు. చంద్రయాన్ 2లో ఆర్బిటర్ జాబిల్లి కక్ష్యలో తిరుగుతుండగా దాన్నే చంద్రయాన్ 3కి వినియోగించుకోనున్నారు.
"చంద్రయాన్ 3 వాహకనౌక పూర్తిగా సిద్ధమైంది. దానిని పూర్తిగా పరీక్షించి కంపార్ట్మెంట్లో జత చేశాం. ప్రయోగానికి జులై 12 నుంచి 19 వరకు అనుకూలంగా ఉంది. వీలైనంత త్వరగా ప్రయోగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అది 12,13, 14.. ఏ తేదీ అయినా కావచ్చు."
-ఎస్ సోమ్‌నాథ్, ఇస్రో ఛైర్మన్
Chandrayaan 3 launch time : చంద్రయాన్-2కు కొనసాగింపు మిషన్‌గా చంద్రయాన్-3ను చేపట్టింది ఇస్రో. చంద్రుడిపై సురక్షితంగా ల్యాండ్ అవ్వడం, ఉపరితలంపై తిరగడం వంటివి ఈ ప్రయోగంలో లక్ష్యాలుగా పెట్టుకుంది. చంద్రయాన్-3లో స్పెక్ట్రో-పోలారిమెట్రి అనే పరికరాన్ని పంపించనున్నట్లు అధికారులు తెలిపారు. భూమిపై పడే కాంతి ధ్రువణాన్ని చంద్రుడి కక్ష్యలో నుంచి కొలిచేందుకు ఈ పరికరం ఉపయోగపడుతుందని చెప్పారు.
ఏం పంపిస్తారంటే?
చంద్రయాన్-3 ప్రయోగంలో భాగంగా ఓ రోవర్, ల్యాండర్‌ను జాబిల్లిపైకి పంపించనున్నారు. రాకెట్‌లోని ప్రొపల్షన్ మాడ్యూల్.. ల్యాండర్, రోవర్లను చంద్రుడి కక్ష్యకు 100 కిలోమీటర్ల దూరం వరకు తీసుకెళ్తుంది. చంద్రుడిపైకి రోవర్‌ను దించేందుకు ల్యాండర్ సహకరిస్తుంది. ల్యాండింగ్ తర్వాత చంద్రుడిపై తిరుగుతూ కీలక సమాచారాన్ని రోవర్.. భూమికి చేరవేస్తుంది.