తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చంద్రయాన్-3 ప్రయోగానికి ముహూర్తం ఫిక్స్.. మరో 15రోజుల్లో లాంఛ్

Chandrayaan 3 launch date : చంద్రయాన్-3 ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. జులై 13న మధ్యాహ్నం ఈ ప్రయోగం చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

chandrayaan-3-launch-date
chandrayaan-3-launch-date

By

Published : Jun 28, 2023, 6:40 PM IST

Updated : Jun 28, 2023, 7:14 PM IST

Chandrayaan 3 launch date : చంద్రయాన్-3 ప్రయోగానికి ముహూర్తం ఖరారైంది. జూలై 13న చంద్రయాన్-3 ప్రయోగం చేపట్టనున్నట్లు అధికారులు ప్రకటించారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రయోగం ఉంటుందని వెల్లడించారు. లాంఛ్ వెహికిల్ మార్క్-3 ద్వారా చంద్రయాన్-3ను ప్రయోగించనున్నట్లు తెలిపారు. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి రాకెట్​ను ప్రయోగిస్తామని చెప్పారు.

Chandrayaan 3 launch time : చంద్రయాన్-2కు ఫాలో-ఆన్ మిషన్​గా చంద్రయాన్-3ని చేపట్టింది ఇస్రో. చంద్రుడిపై సురక్షితంగా ల్యాండ్ అవ్వడం, ఉపరితలంపై అటూఇటూ తిరగడం వంటివి ఈ ప్రయోగంలో లక్ష్యాలుగా నిర్దేశించుకుంది. చంద్రయాన్-3లో స్పెక్ట్రో-పోలారిమెట్రి అనే పరికరాన్ని పంపించనున్నట్లు అధికారులు తెలిపారు. భూమిపై పడే కాంతి ధ్రువణాన్ని చంద్రుడి కక్ష్యలో నుంచి కొలిచేందుకు ఈ పరికరం ఉపయోగపడుతుందని చెప్పారు.

ఏం పంపిస్తారంటే?
చంద్రయాన్-3 ప్రయోగంలో భాగంగా ఓ ల్యాండర్, రోవర్​ను జాబిల్లిపైకి పంపించనున్నారు. రాకెట్​లోని ప్రొపల్షన్ మాడ్యూల్.. ల్యాండర్, రోవర్​లను చంద్రుడి కక్ష్యకు 100 కిలోమీటర్ల దూరం వరకు తీసుకెళ్తుంది. చంద్రుడిపైకి రోవర్​ను దించేందుకు ల్యాండర్ సహకరిస్తుంది. ల్యాండింగ్ తర్వాత చంద్రుడిపై తిరుగుతూ కీలక సమాచారన్ని రోవర్.. భూమికి చేరవేయనుంది.

జూన్ 12 నుంచి 19 మధ్య చంద్రయాన్ ప్రయోగం చేపట్టే అవకాశాలు ఉన్నాయని గతంలోనే ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ వెల్లడించారు. ఈ సమయంలో ప్రయోగం చేపడితే తక్కువ ఇంధన ఖర్చుతోనే చంద్రుడిని చేరుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. ఇప్పటికే చంద్రయాన్ వ్యోమనౌక శ్రీహరికోటకు చేరుకుందని తెలిపారు. చంద్రయాన్ ప్రయోగంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసేందుకు వ్యోమనౌకలో చాలా మార్పులు చేసినట్లు సోమనాథ్ వెల్లడించారు. సౌరశక్తిని అధికంగా ఒడిసిపట్టేలా పెద్ద సోలార్ ప్యానెళ్లను అమర్చినట్లు వివరించారు.

అన్ని పరీక్షలు విజయవంతంగా పూర్తైతేనే చంద్రయాన్-3 ప్రయోగం చేపడతామని సోమనాథ్ ఇదివరకే స్పష్టం చేశారు. ప్రయోగ సమయంలో తలెత్తే సమస్యల నివారణకు హార్డ్​వేర్, కంప్యూటర్ సాఫ్ట్​వేర్ సెన్సార్లలో కీలక మార్పులు చేసినట్లు చెప్పారు. రాకెట్ ఇంధన సామర్థ్యాన్ని సైతం పెంచినట్లు తెలిపారు. ల్యాండర్ కాళ్లను బలోపేతం చేసినట్లు తెలిపారు. రాకెట్​కు అమర్చిన సోలార్ ప్యానెళ్లు ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేసేందుకు సహకరిస్తాయని వివరించారు.

చంద్రయాన్-2 ఏమైందంటే?
2019లో చంద్రయాన్-2 ప్రయోగం చేపట్టారు. జులై 22న రాకెట్​ను లాంఛ్ చేయగా.. ఆగస్టు 20న చంద్రుడి కక్ష్యలోకి అది ప్రవేశించింది. అయితే ఆఖరి నిమిషంలో ప్రయోగం అనూహ్య మలుపులు తిరిగింది. ప్రయోగంలో భాగంగా ల్యాండర్.. చంద్రుడిపై దిగాల్సి ఉండగా.. అది క్రాష్ అయింది. జాబిల్లి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల దూరంలో ఉండగా.. ఇస్రోతో ల్యాండర్​కు సంబంధాలు తెగిపోయాయి. సాఫ్ట్​వేర్​లో సమస్య వల్ల క్రాష్ ల్యాండ్ అయినట్లు ఇస్రో తన ఫెయిల్యూర్ అనాలసిస్ నివేదికలో వివరించింది. అయితే, ప్రయోగంలో భాగంగా పంపించిన ఆర్బిటార్ మాత్రం చక్కగా పనిచేసింది. చంద్రుడి చుట్టూ వేల ప్రదక్షిణలు చేసింది.

Last Updated : Jun 28, 2023, 7:14 PM IST

ABOUT THE AUTHOR

...view details