Chandrayaan 3 Launch Countdown : చంద్రయాన్-3 ప్రయోగానికి సమయం ఆసన్నమైంది. గురువారం మధ్యాహ్నం ప్రారంభమైన కౌంట్‌డౌన్ ప్రక్రియ.. 25.30 గంటల పాటు కొనసాగనుంది. శుక్రవారం మధ్యాహ్నం 2:35:13 గంటలకు రెండో ప్రయోగ వేదిక నుంచి ఎల్‌వీఎం-3పీ4 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి దీనిని ప్రయోగించనున్నారు. ఆగస్టు 23 లేదా 24న సాఫ్ట్ ల్యాండింగ్ జరిగే అవకాశముందని ఇస్రో ఛైర్మన్ సోమ్‌నాథ్ తెలిపారు. బాహుబలి రాకెట్‌గా గుర్తింపు పొందిన ఎల్‌వీఎం3-ఎం4.. దీన్ని మోసుకెళ్తోంది. చంద్రయాన్-2 పేరిట నాలుగేళ్ల కిందట జాబిల్లిపై ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తున్న క్రమంలో ఎదురైన వైఫల్యం నుంచి పాఠాలు నేర్చుకున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో).. రెట్టించిన ఉత్సాహంతో తాజా ప్రయోగానికి సిద్ధమైంది.
ప్రయోగానికి సిద్ధమైన చంద్రయాన్ 3 వ్యోమనౌక "ఇది భారత అంతరిక్ష పరిశోధనలో కీలక మైలురాయి. చంద్రయాన్-3 ప్రయోగం కచ్చితంగా విజయవంతం అవుతుందని ఆశిస్తున్నాను. చంద్రయాన్-2 ప్రయోగంలో ఎదుర్కొన్న సవాళ్ల నుంచి ఇస్రో పాఠాలు నేర్చుకుని ఈ ప్రయోగం చేపట్టింది. ఇది చాలా క్లిష్టమైన పని కాబట్టి.. చాలా జాగ్రత్తగా పూర్తి చేయాలి. ఇందులో ఏ చిన్న తప్పు కూడా జరగకూడదు. అనేక వ్యవస్థలు ఉన్నందున.. అన్ని కోణాల్లో జాగ్రత్తగా పరిశీలించాలి."
--జీ మాధవన్ నాయర్, ఇస్రో మాజీ ఛైర్మన్
ఈ ప్రయోగం విజయవంతమైతే ప్రపంచంలోనే చంద్రుడిపై ల్యాండర్లను దింపిన నాలుగో దేశంగా రికార్డుల్లోకి ఎక్కనుంది భారత్. ఇప్పటివరకు సోవియట్ యూనియన్, అమెరికా, చైనా మాత్రమే చందమామపై ల్యాండర్లను ఎలాంటి ఇబ్బంది లేకుండా దించాయి. మనకంటే ముందే ఆ దేశాలు చందమామను చేరుకున్నా.. అమెరికానైతే ఏకంగా మనుషులనే చంద్రుడిపైకి పంపించినా.. ఇప్పుడు భారత్ చేస్తున్న ప్రయత్నానికో ప్రత్యేకత ఉంది. అదే ఇప్పటిదాకా చంద్రుడిపై ఎవరూ వెళ్లని దక్షిణ ధ్రువానికి వెళ్లటం.. అక్కడి ప్రత్యేక పరిస్థితుల గురించి శోధించటం!
ప్రయోగానికి సిద్ధమైన చంద్రయాన్ 3 వ్యోమనౌక దక్షిణ ధ్రువమే ఎందుకంటే..
ఇప్పటివరకు చంద్రుడిపైకి వెళ్లిన వ్యోమనౌకల్లో అత్యధికం అక్కడి మధ్య రేఖా ప్రాంతంలోనే దిగాయి. భారత్ మాత్రం చంద్రయాన్-3 కోసం ఇంతవరకు ఎవరూ వెళ్లని దక్షిణ ధ్రువానికి దగ్గర్లోని 70 డిగ్రీల అక్షాంశం వద్ద ప్రాంతాన్ని ఎంచుకుంది. ఇలా భారత్ వినూత్న ప్రదేశాన్ని ఎంచుకోవడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. అక్కడ ల్యాండింగ్ చేయడం ద్వారా విశ్వం ఆవిర్భావం గురించిన కొత్త విషయాలను తెలుసుకునే అవకాశం ఉండటమే కాకుండా.. భవిష్యత్తులో చంద్రుడిపై మానవ ఆవాసాల ఏర్పాటుకు మార్గం ఏర్పడుతుందంటున్నారు.
ప్రయోగానికి సిద్ధమైన చంద్రయాన్ 3 వ్యోమనౌక విశ్వ రహస్యం
చంద్రుడిపై ఉన్న దక్షిణ ధ్రువ ప్రాంతంలో భౌతిక పరిస్థితులు ఎంతో ప్రత్యేకం. చంద్రుడి ఉత్తర ధ్రువంతో పోలిస్తే దక్షిణ ధ్రువ ప్రాంతంలోని కొన్ని భాగాలు శాశ్వతంగా చీకట్లోనే ఉంటాయి. కొన్ని వందలకోట్ల ఏళ్లుగా ఆ ప్రాంతాలను సూర్యకాంతి తాకలేదు. అందువల్ల అక్కడి మూలకాలు సౌర రేడియోధార్మికత కారణంగా తలెత్తే మార్పులకు లోనుకాకుండా ఉంటాయి. వాటిని ఛేధిస్తే విశ్వాన్ని గురించిన అనేక నిగూఢ రహస్యాలు తెలిసే అవకాశాలున్నాయి. అక్కడి పురాతన శిలలపై పరిశోధనలు జరపడం ద్వారా విశ్వ ఆవిర్భావం, తొలినాటి సౌర కుటుంబ చరిత్ర గురించి కొత్త వివరాలు తెలుసుకోవచ్చు.
ప్రయోగానికి సిద్ధమైన చంద్రయాన్ 3 వ్యోమనౌక ప్రయోగానికి సిద్ధమైన చంద్రయాన్ 3 వ్యోమనౌక చంద్రయాన్-1: వెలుగులోకి నీటి జాడ
Chandrayaan 1 Launch Date : 2008 నుంచి చంద్రుడిపై భారత్ ప్రయోగాలు చేస్తోంది. ఆ ఏడాది అక్టోబరు 22న పీఎస్‌ఎల్‌వీ రాకెట్ ద్వారా చంద్రయాన్-1ను ప్రయోగించింది. 2008 నవంబరు 8న అది చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. అక్కడే ఉంటూ పరిశోధనలు సాగించింది. దీనిలో భాగంగా ప్రయోగించిన 35 కిలోల మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ (ఎంఐపీ) చందమామ ఉపరితలంపై నీటి జాడను తొలిసారిగా కనుగొంది.
చంద్రయాన్-2: చివరి నిమిషంలో..
Chandrayaan 2 Launch Date : ఆ తర్వాత చంద్రయాన్-1కు కొనసాగింపుగా రూ.978 కోట్లతో చంద్రయాన్-2ను చేపట్టింది భారత్. 2019 జులై 22న దీన్ని శ్రీహరికోట నుంచి ప్రయోగించింది. 48 రోజుల ప్రయాణం అనంతరం ఆర్బిటర్ చందమామ కక్ష్యలోకి దిగ్విజయంగా చేరింది. 2019 సెప్టెంబరు 7 అర్ధరాత్రి సమయంలో రోవర్, ల్యాండర్‌తో కూడిన మాడ్యూల్.. అనుకున్న రీతిలో ఆర్బిటర్ నుంచి విడిపోయింది. చంద్రుడి దక్షిణ ధ్రువం దిశగా ప్రయాణంలో జాబిల్లి ఉపరితలానికి 2 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న సమయంలో ఇబ్బంది తలెత్తింది. నియంత్రణ కోల్పోయి, చంద్రుడిని బలంగా ఢీ కొట్టింది. ఫలితంగా ల్యాండర్, రోవర్‌లు ధ్వంసమయ్యాయి. చంద్రయాన్-2కు సంబంధించిన ఆర్బిటర్ మాత్రం ఇంకా పనిచేస్తోంది. ఇది చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తూ విలువైన డేటాను అందిస్తోంది. చంద్రయాన్-2 లోపాల నుంచి పాఠాలు నేర్చుకొని ఇప్పుడు చంద్రయాన్-3ని ఇస్రో ప్రయోగిస్తోంది.
శీతల బిలాల్లో..
దక్షిణ ధ్రువం వద్ద ఉన్న చీకటి బిలాల్లో ఉష్ణోగ్రత మైనస్ 248 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుంది. ఆ స్థాయి శీతల ఉష్ణోగ్రతలతో అవి 'కోల్డ్ ట్రాప్స్'గా పనిచేస్తాయి. అంటే వాటిలో నీరు హిమరూపంలో స్థిరంగా ఉండే అవకాశాలున్నాయి. అందువల్ల కొన్ని బిలాల్లో గణనీయ పరిమాణంలో మంచు నిల్వలు ఉండొచ్చని అనుకుంటున్నారు. నీరు ఉండటం వల్ల జీవజాలం మనుగడ ఆస్కారాలను శోధిస్తారు. అందువల్ల చంద్రయాన్-3 పూర్తిగా కొత్త ప్రదేశాన్ని శాస్త్రసమాజం ముందు ఆవిష్కరిస్తుంది. భవిష్యత్‌లో చేపట్టబోయే మానవసహిత, రోబోటిక్ యాత్రలకు ఈ డేటా ఎంతో ఉపకరిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.
చంద్రుడిపైకి ఎందుకు?
- తరతరాలుగా మానవాళికి చందమామ ప్రధానాకర్షణగా మారింది. సైన్స్ కోణంలో ఎంతో కుతూహలాన్ని రగిలిస్తోంది. చంద్రుడి పుట్టుక.. పరిణామం దిశగా సాగిన తీరు ఆసక్తికరంగా మారాయి. కోట్ల ఏళ్ల పాటు అనేక అంతరిక్ష శిలలను ఢీకొని తట్టుకొని అది నిలబడింది.
- వచ్చే కొన్నేళ్లలో జాబిల్లిపై ఆవాసాన్ని ఏర్పాటు చేయాలని.. దాన్ని ఇతర గ్రహాల అన్వేషణకు మజిలీగా ఉపయోగించుకోవాలని అనేక దేశాలు భావిస్తున్నాయి.
- భూమితో పోలిస్తే చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి ఆరో వంతే ఉంటుంది. గాలి కూడా ఉండదు. అందువల్ల భూమితో పోలిస్తే చందమామ నుంచి రాకెట్ ప్రయోగాలు చేయడం చాలా సులువు. ఇందుకు ఖర్చు కూడా తక్కువే. అంగారకుడు, విశ్వంలోని సుదూర ప్రదేశాల దిశగా చేసే యాత్రలకు జాబిల్లి అనువైన వేదికగా ఉపయోగపడుతుంది.
- జాబిల్లిపై హీలియం-3 వంటి వనరులు పుష్కలంగా ఉన్నాయి. వాటి విస్తృతిపై లోతైన సమాచారం సేకరించగలిగితే అక్కడ మైనింగ్ కూడా చేపట్టవచ్చేమో తెలుస్తుంది. అవసరాన్ని బట్టి వాటిని అక్కడి కాలనీల్లో వినియోగించొచ్చు లేదా భూమికి రప్పించొచ్చు.
- చందమామపై వాతావరణం దాదాపుగా లేకపోవడం వల్ల విశ్వంపై జరిపే రేడియోతరంగ, ఖగోళభౌతిక పరిశీలనలకు అది అనువైన వేదిక. గురుత్వాకర్షణ తరంగాలపై పరిశోధనలకూ జాబిల్లి సాయపడుతుంది. చంద్రుడి ఉపరితలంపై గురుత్వాకర్షణ తరంగ డిటెక్టర్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా ఉంది.
ఇవీ చదవండి :చంద్రయాన్-3కి కొత్త ముహూర్తం.. ప్రయోగం ఎప్పుడంటే?
'ఈసారి చంద్రుడిపై ల్యాండర్‌ను దించడం ఖాయం.. ప్రయోగం తేదీ ఇదే'