Chandrayaan 3 Landing Time :దశాబ్దాల నుంచి ప్రపంచ దేశాలకు అందని ద్రాక్షగా ఊరిస్తున్న జాబిల్లి దక్షిణ ధ్రువంపై ల్యాండర్‌ను దింపేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్రో సర్వం సిద్ధం చేసింది. బుధవారం సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు జాబిల్లి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 ల్యాండర్ విక్రమ్ దిగనుంది. శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం-షార్ నుంచి 2023 జులై 14న.. చంద్రయాన్-3ని నింగిలోకి పంపింది. ఆగస్టు 5నాటికి చంద్రయాన్-3ని చంద్రుడి కక్ష్యలోకి చేర్చిన ఇస్రో తర్వాత క్రమంగా... కక్ష్య తగ్గింపు ప్రక్రియలు చేపట్టింది. ఆగస్టు 17న నిర్వహించిన చివరి ప్రక్రియలో చంద్రయాన్-3 ప్రొపల్షన్ మాడ్యుల్ నుంచి విక్రమ్ ల్యాండర్ విడిపోయింది.
విక్రమ్ ఇప్పుడు ఎక్కడ ఉందంటే?
Chandrayaan 3 News :ప్రజ్ఞాన్ రోవర్‌తో కూడిన విక్రమ్ ల్యాండర్ ప్రస్తుతం చంద్రుడి చుట్టూ 25 కిలోమీటర్లు x 134 కిలోమీటర్ల కక్ష్యలో పరిభ్రమిస్తుండగా... ఈ కక్ష్య నుంచే విక్రమ్ ల్యాండర్ ఈ సాయంత్రం ఆరు గంటల 4 నిమిషాలకు చంద్రుడి ఉపరితలంపై దిగే క్లిష్టమైన ప్రక్రియను ఇస్రో చేపట్టనుంది. రెండు మీటర్ల ఎత్తు, 17వందల కిలోల బరువుతో ఓ SUV అంత ఉండే విక్రమ్ ల్యాండర్‌ను చంద్రుడి ఉపరితలం... అదీ దక్షిణ ధ్రువంపై దించడం పెద్ద సవాలుతో కూడిన వ్యవహారమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొన్నిరోజుల నుంచి చంద్రుడి కక్ష్యలో పరిభ్రమిస్తున్న విక్రమ్ ల్యాండర్... తనలోని ల్యాండర్ హజార్డ్ డిటెక్షన్ అండ్ అవాయిడెన్స్ కెమెరాతో చిత్రీకరించిన చందమామ దక్షిణ ధ్రువం ఫొటోలనుఇస్రో ఇప్పటికే అందుకుంది. ఆ ఫోటోలు,ల్యాండర్ హజార్డ్ డిటెక్షన్ అండ్ అవాయిడెన్స్ కెమెరా సహాయంతో ఇస్రో.. విక్రమ్ ల్యాండర్‌ను రాళ్లు, గుంతలను లేనిచోట దింపడానికి ఏర్పాట్లు చేస్తోంది.
Chandrayaan 3 Live :చంద్రుడి చుట్టూ ప్రస్తుతం పరిభ్రమిస్తున్న కక్ష్య నుంచి విక్రమ్ ల్యాండర్ జాబిల్లి ఉపరితలంపై దిగడానికి 17 నిమిషాలు పడుతుందని అంచనావేసిన ఇస్రో..ఇది ల్యాండింగ్ ప్రక్రియలో అత్యంత కీలకమైన సమయమని పేర్కొంది. ఒకసారి విక్రమ్ ల్యాండర్ జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగగానే.. అందులో నుంచి 26 కిలోల బరువు ఉండే ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వస్తుంది. ఈ రోవర్.. కనీసం పద్నాలుగు రోజులు చంద్రుడి ఉపరితలం, అక్కడి వాతావరణ పరిస్థితులపై అధ్యయనం చేయనుందని ఇస్రో ఛైర్మన్ S.సోమ్‌నాథ్ తెలిపారు. ప్రస్తుతం ల్యాండర్ మాడ్యూల్ చక్కగా పనిచేస్తోందని, ఈ ప్రయోగానికి సంబంధించిన అన్ని వ్యవస్థలూ బాగా పని చేస్తున్నాయని ఆయన వివరించారు. ల్యాండింగ్‌కు రెండు గంటల ముందు ల్యాండర్‌లో ఉన్న శాస్త్రీయ పరికరాలతో చంద్రుడి ఉపరితలంపై పరిస్థితి క్షుణ్నంగా సమీక్షించి అన్నీ అనుకూలంగా ఉంటేనే ల్యాండింగ్ ప్రక్రియ చేపడతామని సోమ్‌నాథ్ తెలిపారు.