Chandrayaan 3 landing Success Wishes : చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ కావడంపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జాబిల్లిపై విక్రమ్ ల్యాంజర్ను విజయవంతంగా దింపడం వల్ల ఇస్రోపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికాలో జొహెన్నెస్‌బర్గ్ నుంచి స్వయంగా ఇస్రో ఛైర్మన్ సోమనాథ్‌కు ఫోన్ చేసి అభినందించారు. త్వరలోనే బెంగళూరు పర్యటనకు వచ్చి చంద్రయాన్-3 మిషన్ బృందాన్ని అభినందించనున్నట్లు మోదీ చెప్పారు. ఈ విజయం అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించాలనే సంకల్పానికి నిదర్శనమని ప్రధాని మోదీ కొనియాడారు.
"ఇస్రో శాస్త్రవ్తేతలు, చంద్రయాన్ బృందానికి నా హృదయపూర్వక అభినందనలు. ఈ క్షణం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశా. చంద్రయాన్-3 ప్రయోగం విజయం కోసం 140 కోట్ల మంది భారత ప్రజలు ఎదురు చూశారు. ప్రపంచంలోనే తొలిసారిగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టాం. చంద్రయాన్ ఘన విజయంతో నా జీవితం ధన్యమైంది. బ్రిక్స్ సమావేశాల్లో ఉన్నా నా మనసంతా చంద్రయాన్‌పైనే ఉంది. భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఏ దేశమూ చేరుకోలేదు. మన శాస్త్రవేత్తల కఠోర శ్రమవల్లే ఈ విజయం సాధించగలిగాం. భారత్ సాధించిన ఈ అద్భుత విజయం ఒక్క మన దేశానిది మాత్రమే కాదు.. మానవాళి అందరిదీ"
--నరేంద్ర మోదీ, భారత ప్రధాని
హర్షం వ్యక్తం చేసిన రాష్ట్రపతి..
చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావడం వల్ల రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము.. ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. దేశం గర్వించేలా చేశారని వారిని కొనియాడారు. ఇస్రో శాస్త్రవేత్తలు మున్ముందు మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు.
'మద్దతుగా నిలిచిన ప్రధాని మోదీ, దేశ ప్రజలకు ధన్యవాదాలు'
చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్‌ను సురక్షితంగా దింపడంపై ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ స్పందించారు. దేశం కోసం స్ఫూర్తిదాయక కార్యం సాధించినందుకు గర్వంగా ఉందని అన్నారు. ఇస్రోకు మద్దతుగా నిలిచిన ప్రధాని మోదీకి, దేశ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కొన్ని రోజులుగా 'చంద్రయాన్-3 ప్రయోగం విజయం కావడం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఇస్రో శాస్త్రవేత్తల్లో సీనియర్లు మరింత విశ్వాసం నింపారు. చంద్రయాన్-1 నుంచి ప్రస్తానం కొనసాగుతోంది. చంద్రయాన్-2 ఇప్పటికీ పనిచేస్తోంది.. కమ్యూనికేట్ చేస్తోంది.' అని సోమనాథ్ అన్నారు.
'మోదీ నాయకత్వంలో ప్రత్యేక గుర్తింపు'
మరోవైపు చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ కావడంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించారు. ' చంద్రయాన్-3 ప్రయోగంలో భాగమైన శాస్త్రవేత్తలకు అభినందనలు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ అంతరిక్ష రంగంలోనూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును పొందింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండర్‌ను దింపిన తొలి దేశంగా భారత్ నిలిచింది. 9 ఏళ్ల మోదీ పాలనలో 47 అంతరిక్ష యాత్రలు జరిగాయి. ఇవి యూపీఏ హయాంలో నిర్వహించిన ప్రయోగాలకు రెట్టింపు' అని నడ్డా తెలిపారు.
'చాలా సంతోషంగా ఉన్నా'
చంద్రయాన్-3 ప్రయోగం సఫలమవ్వడంపై ఆనందం వ్యక్తం చేశారు ఇస్రో మాజీ ఛైర్మన్ కె. శివన్. 'ఇస్రో శాస్త్రవేత్తలకు నా అభినందనలు. ఈ క్షణమే కోసమే చాలా ఏళ్లుగా ఎదురుచూశా. ప్రయోగం సక్సెస్ కావడంపై సంతోషంగా ఉన్నా.' అని శివన్ తెలిపారు.
'దేశ ప్రజల సమష్ఠి విజయం'
చంద్రయాన్-3 విజయం.. ప్రతి ఒక్క దేశపౌరుడి సమష్ఠి విజయమని పేర్కొంది కాంగ్రెస్. ఇస్రో సాధించిన ఈ ఘనత.. విజయాల పరంపరకు కొనసాగింపు అని కొనియాడింది. ప్రస్తుతం ప్రపంచం మొత్తం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) వైపు చూస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఇస్రో టీమ్‌కు అభినందనలు చెప్పారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. శాస్త్రవేత్తల దశాబ్దాల కృషి వల్లే చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ సురక్షితంగా దింపగలిగారని అన్నారు.