Chandrayaan 3 Lander Sleep Mode : చంద్రయాన్-3 మిషన్‌లో భాగంగా చంద్రుడిపైకి పంపిన విక్రమ్ ల్యాండర్‌ను నిద్రపుచ్చినట్లు ఇస్రో ప్రకటించింది. జాబిల్లిపై శివశక్తి పాయింట్‌వద్ద చీకట్లు అలముకోనున్న వేళ.. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 8 గంటలకు విక్రమ్ ల్యాండర్‌ను నిద్రాణ స్థితిలోకి పంపినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పేర్కొంది. అంతకంటే ముందు కొత్త ప్రాంతంలో పేలోడ్లు రాంభా, చాస్టే, ILSA ప్రయోగాలు నిర్వహించినట్లు ఇస్రో వెల్లడించింది. ఆ ప్రయోగాల ద్వారా సేకరించిన డేటా భూమికి చేరినట్లు పేర్కొంది. పేలోడ్లను స్విచ్ ఆఫ్ చేసినట్లు తెలిపిన ఇస్రో ల్యాండర్ రీసివర్లను మాత్రం ఆన్‌లో ఉంచినట్లు వివరించింది. సెప్టెంబర్ 2న రోవర్‌ను కూడా నిద్రాణ స్థితిలోకి పంపింది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో. చంద్రయాన్-3 మిషన్‌లో నిర్దేశించిన లక్ష్యాలకు మించి విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ పనితీరు కనబర్చినట్లు ఇస్రో తెలిపింది.
ఆగస్టు 23న జాబిల్లి దక్షిణ ధ్రువానికి సమీపంలో విక్రమ్ ల్యాండర్‌ను సురక్షితంగా దింపి చరిత్ర సృష్టించిన భారత్.. ఇప్పటికే నిర్దేశించుకున్న లక్ష్యాలను అన్నింటినీ చేరుకుంది. విక్రమ్ ల్యాండర్ దిగిన శివశక్తి పాయింట్ వద్ద క్రమంగా చీకట్లు ఆవరించనున్నాయి. భూమిపై 14 రోజులకు సమానమైన చంద్రునిపై రాత్రివేళ నెలకొనే ప్రతికూల పరిస్థితులను విక్రమ్, ప్రజ్ఞాన్‌లు తట్టుకోలేవు. ఏకబిగిన 14 రోజుల పాటు సూర్యకాంతి అందుబాటులో లేకపోవడమే ప్రధాన సమస్య. ఆ సమయంలో బ్యాటరీల రీఛార్జి అసాధ్యం. జాబిల్లిపై రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు దాదాపు మైనస్ 200 డిగ్రీలకు పడిపోతాయి. ఇంత అసాధారణ శీతల వాతావరణాన్ని ల్యాండర్, రోవర్‌లోని సున్నితమైన ఎలక్ట్రానిక్ ఉపకరణాలు తట్టుకోలేకపోవచ్చు. అందువల్ల ఈ రెండింటినీ నిద్రాణ స్థితిలో ఉంచారు. జాబిల్లిపై సూర్యోదయమయ్యాక అంటే ఈ నెల 22వ తేదీన మళ్లీ ల్యాండర్, రోవర్ క్రియాశీలమయ్యే అవకాశం లేకపోలేదు. ఆ రోజున సూర్యకాంతిని అందుకునేలా రోవర్, ల్యాండర్‌లలో రిసీవర్లను సిద్ధంగా ఉంచారు. ఒకవేళ అవి క్రియాశీలం కాకుంటే చంద్రమండలంపై భారత రాయబారులుగా ఎప్పటికీ అక్కడే ఉండిపోతాయి.