Chandrayaan 3 Landed on Moon :41 రోజుల సుదీర్ఘ ప్రయాణం అనంతరం విక్రమ్ ల్యాండర్ జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టింది. ఇప్పటివరకు అమెరికా, చైనా, సోవియట్ యూనియన్ మాత్రమే చందమామపై సాఫ్ట్ ల్యాండింగ్ సాధించగా వాటి సరసన భారత్ కూడా చేరింది. అయితే ఏ దేశమూ చేరుకోని జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టడం ఇస్రో ఖ్యాతిని విశ్వవాప్తం చేసింది.
Chandrayaan 3 Successful Landing : జులై 14న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి దూసుకెళ్లిన బాహుబలి రాకెట్ ఎల్‌వీఎం3-ఎం4...చంద్రయాన్-3ని విజయవంతంగా భూకక్ష్యలోకి చేరింది. 18 రోజుల వ్యవధిలో దశలవారీగా అయిదుసార్లు కక్ష్యను పెంచారు. అయిదో భూకక్ష్య పూర్తయిన అనంతరం.. జాబిల్లి దిశగా ప్రయాణానికిగానూ ఆగస్టు 1న ట్రాన్స్ లూనార్ కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. అక్కడి నుంచి ఆగస్టు 5న విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి చేర్చారు. క్రమంగా కక్ష్యలను తగ్గిస్తూ చందమామకు చేరువ చేశారు. ఆ తర్వాత ఆగస్టు 17న ఈ వ్యోమనౌకలోని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌తో కూడిన ‘ల్యాండర్ మాడ్యూల్’ ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విజయవంతంగా విడిపోయింది. సొంతంగా చంద్రుడి కక్ష్యలో పరిభ్రమించింది. ఆ తర్వాత రెండు సార్లు డీ-అర్బిట్ ప్రక్రియలు చేపట్టి ల్యాండర్‌ను జాబిల్లి ఉపరితలానికి దగ్గర చేశారు.
బుధవారం సాయంత్రం 5 గంటల 44 నిమిషాలకు ల్యాండర్ మాడ్యూల్ చంద్రునిపై దిగేందుకు నిర్దేశిత ప్రాంతానికి చేరుకుంది. చంద్రుడి ఉపరితలానికి 30 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు ఆటోమేటిక్ ల్యాండింగ్ సీక్వెన్స్ ప్రారంభమైంది. ALS కమాండ్‌ను స్వీకరించిన వెంటనే ల్యాండర్ మాడ్యూల్ వేగాన్ని తగ్గించుకుంటూ ముందుకెళ్లింది. చివరి 17 నిమిషాల సంక్షిష్ట ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసుకున్న విక్రమ్ ల్యాండర్ సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు జాబిల్లిపై అడుగుపెట్టింది. గంటకు దాదాపు 6 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన వ్యోమనౌక నిమిషాల వ్యవధిలోనే తన జోరుకు కళ్లెం వేసుకుని చందమామ దక్షిణ ధ్రువంపై సురక్షితంగా దిగింది. బెంగళూర్‌లోని మిషన్ కంట్రోల్ కాంప్లెక్స్ నుంచి చంద్రయాన్-3 ల్యాండింగ్ ఈవెంట్‌ను ఇస్రో శాస్త్రవేత్తలు పర్యవేక్షించారు. బ్రిక్స్ సదస్సు కోసం దక్షిణాఫ్రికాలో ఉన్న ప్రధాని మోదీ వర్చువల్‌గా ఈ ల్యాండింగ్ ప్రక్రియను తిలకించారు.
పదిహేనేళ్ల క్రితం చంద్రుడిపై నీరుందని తేల్చి విశ్వపరిశోధనల్లో కొత్త శ్వాస నింపిన భారత్.. ఇప్పుడు చంద్రయాన్-3తో ఎవరూ చూడని 'దక్షిణ' జాడల్ని ప్రపంచానికి చూపించింది. విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్ 14 రోజుల పాటు జాబిల్లి ఉపరితలంపై పరిశోధనలు చేస్తాయి. జాబిల్లిపై వాతావరణ పరిస్థితులు, ఉపరితల నిర్మాణం వంటి అంశాలను అవి నిశితంగా శోధిస్తాయి. ఇటీవల భారత్ కంటే ముందు చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్‌ల్యాండింగ్‌కు యత్నించి రష్యా విఫలమవగా ఇస్రో మాత్రం జయకేతనం ఎగురవేయడం వల్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు రోడ్లపైకి వచ్చి బాంబులు కాల్చి, స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. విద్యార్థులు, జవాన్లు సంతోషం వ్యక్తం చేశారు.
అమృత కాలంలో తొలి ఘన విజయం : మోదీ
Pm Modi on Chandrayaan 3 : భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ కావటంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ మిషన్‌లో భాగస్వాములైన శాస్త్రవేత్తలను అభినందించారు. ఈ విజయం అభివృద్ధి చెందిన భారత్‌గా అవతరించాలనే సంకల్పానికి నిదర్శనమని కొనియాడారు.
"ప్రియమైన నా కుటుంబసభ్యులారా.. ఎప్పుడైతే మన కళ్లముందు ఇలాంటి చరిత్ర సృష్టించే ఘటనలను చూస్తే జీవితం ధన్యమవుతుంది. ఇలాంటి చారిత్రక ఘటనలు దేశగతిని అజరామరం చేస్తాయి. ఈ క్షణాలు.. అపూర్వమైనవి, ఈ క్షణాలు అభివృద్ధి చెందిన దేశం సంకల్పానివి, ఈ క్షణాలు నవభారతం జయజయధ్వానాలవి, ఈ క్షణాలు కష్టాల సముద్రాన్ని అధిగమించేవి, ఈ క్షణాలు విజయగర్వంతో చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టేవి, ఈ క్షణాలు 140 కోట్ల గుండెచప్పుడు సామర్థ్యానివి, ఈ క్షణాలు నూతన శక్తి, విశ్వాసం, చేతనకు సంబంధించినవి, ఈ క్షణాలు దేశ నూతన సూర్యోదయానికి నాంది."