Chandrayaan 3 Importance :జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొదటి దేశంగా భారత్ సరికొత్త చరిత్ర లిఖించగా ఇంత క్లిష్టమైన ప్రాంతాన్ని ఇస్రోఎందుకు ఎంచుకుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి? భూమి నుంచి కనిపించని చంద్రుని అవతలి ప్రాంతంలోనే పరిశోధనలను ఇస్రో ఎందుకు చేయాలనుకుంటోంది ? ఏ దేశం సాహసించని ప్రాంతాన్నే ఎందుకు ఎంచుకుంది ? అక్కడ ఉండే వాతావరణ పరిస్థితులపై పరిశోధనలు మానవాళికి ఉపయోగపడనున్నాయా? దీనిపై ఇస్రో ఛైర్మన్ ఏమంటున్నారు? ఈ కథనంలో చూద్దాం.
చంద్రుని దక్షిణ ధ్రువం. ఈ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకునే భారత్, రష్యాలు ల్యాండర్‌లను పంపించాయి. లూనా-25విఫలమవగా.. చంద్రయాన్ సురక్షితంగా అక్కడ అడుగుపెట్టి సరికొత్త చరిత్ర లిఖించింది. జాబిల్లి దక్షిణ ధ్రువ ప్రాంతం చంద్రుని మధ్యరేఖా ప్రాంతానికి చాలా దూరంగా ఉంటుంది. అమెరికా చేపట్టిన మానవ సహిత అపోలో మిషన్లతో సహా ఏ అగ్రరాజ్య ల్యాండర్లు అక్కడ దిగలేదు. ఈ ప్రాంతం మొత్తం లోతైన అగాధాలు, పర్వతాలతో నిండి ఉంటుంది.
Why Isro Launch Chandrayaan 3 :చంద్రుడు పుట్టినప్పటి నుంచి ఈ దక్షిణ ధ్రువ ప్రాంతం అతి తక్కువ సమయం సూర్య కాంతికి గురవుతూ వస్తోంది. ఇక్కడి లోయలు లేదా క్రేటర్‌లు శాశ్వత నీడ ప్రాంతాలుగా ఉన్నాయి. ఈ పర్మినెంట్లీ షాడోడ్ రీజియన్లలో ప్రగ్యాన్ రోవర్ ప్రవేశిస్తుందా అన్న దానిపై ఇస్రో ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అయితే వీటికి దగ్గర్లో మాత్రం పరిశోధనలు చేయనుంది. ఇక్కడ ఉష్ణోగ్రతలు అతి తక్కువ ఉండటం వల్ల చంద్రుని పుట్టుక నాటి పరిస్థితులు ఈ మట్టిలో చెక్కుచెదరకుండా లభ్యమయ్యే అవకాశం ఉంది. తద్వారా భూమి, సౌర కుటుంబం పుట్టుక సమయంలోని విషయాలు తెలుసుకోవచ్చు. అతి ముఖ్యంగా జాబిల్లి దక్షిణ ధ్రువంలోని మట్టిలో నీటి అణువులు గడ్డకట్టిన పరిస్థితిల్లో దొరికే అవకాశం మెండుగా ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు చంద్రుని మధ్యరేఖా ప్రాంతంలో ఎక్కడా కనిపించవు. నీటితో పాటు మినరళ్లు ఇక్కడ ఉండే అవకాశం ఉందని ఇస్రో చీఫ్ సోమనాథ్ తెలిపారు.
"దక్షిణ ధ్రువంపై పరిశోధనలతో ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి. అక్కడ సూర్యరశ్మి చాలా తక్కువగా పడుతుంది. దీని వల్ల అక్కడ శాస్త్రీయ వివరాలు మరింత ఎక్కువగా లభ్యమవుతాయి. ఇక్కడి ఉపరితలానికి కింద పొరల్లో నీరు ఉండే అవకాశం ఉంది. వివిధ మూలకాలు ఉనికి లభ్యమవడంతో పాటు ఎలక్ట్రికల్ యాక్టివిటీలు జరిగే అవకాశాలు మధ్యరేఖా ప్రాంతంతో పోలిస్తే దక్షిణ ధ్రువంలో చాలా ఉన్నాయి. అందుకే శాస్త్రవేత్తలు ఈ దక్షిణ ధ్రువంపై పరిశోధనలకు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు." అని ఎస్. సోమ్‌నాథ్ ఇస్రో ఛైర్మన్ తెలిపారు. మానవాళి అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకునేందుకు కాలనీలు నిర్మించేందుకు దక్షిణ ధ్రువంపై ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు.