OBC Reservation Issue MP: మహారాష్ట్రలో ఓబీసీ రిజర్వేషన్ల విషయంలో భారతీయ జనతా పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్ర వివాదంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కుమార్తె, ఎంపీ సుప్రియా సూలేపై మహారాష్ట్ర భాజపా చీఫ్ చంద్రకాంత్ పాటిల్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. "మీకు రాజకీయాలు అర్థం కాకపోతే ఇంటికెళ్లి వంట చేసుకోండి" అంటూ వ్యాఖ్యానించారు. కాగా, చంద్రకాంత్ వ్యాఖ్యలపై భాజపాయేతర పక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి.
మహారాష్ట్రలోని ఓబీసీలకు సైతం విద్యా, ఉద్యోగాల్లో కోటా అమలు చేయాలంటూ ఆ రాష్ట్ర భాజపా నాయకులు నిరసన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఎంపీ సుప్రియ ఈ విషయంపై స్పందించారు. "మహారాష్ట్ర ముఖ్యమంత్రి కొద్ది రోజుల క్రితం దిల్లీకి వెళ్లి ఎవరినో కలిసి వచ్చారు. అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ, రెండు రోజుల్లో ఓబీసీ రిజర్వేషన్ల అమలుకు కసరత్తు ప్రారంభమైంది" అని అన్నారు. కాగా, దీనిపై చంద్రకాంత్ ఘాటుగా స్పందించారు. "మీరు రాజకీయాల్లో ఎందుకు ఉన్నారు? ఇంటికి వెళ్లి చక్కగా వంట చేసుకోండి. రాజకీయాల్లో ఉండి ముఖ్యమంత్రిని ఎలా కలవాలో తెలీదా? మీరు కూడా దిల్లీకి వెళ్లండి లేదా ఎక్కడైనా వెళ్లండి కానీ ఓబీసీ రిజర్వేషన్లు అమలులోకి తీసుకురండి" అని అన్నారు.