Chandrababu visited Gaddar's Family : తాను రాజకీయాల్లో ఉండి.. ప్రజా చైతన్యం కోసం పని చేస్తే.. గద్దర్ ప్రజలు, పేదల హక్కుల పరిరక్షణ కోసం ఒక పంథా ఎన్నుకొని కృషి చేశారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పేదల హక్కుల కోసం రాజీ లేని పోరాటం చేసిన వ్యక్తి గద్దర్ అని కొనియాడారు. నేడు గద్దర్ నివాసానికి వెళ్లిన చంద్రబాబు ఆయనకు నివాళులు అర్పించి.. కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం బయటకు వచ్చి మాట్లాడారు.
గద్దర్‌ను కోల్పోవడం చాలా బాధాకరమైన విషయమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఒక వ్యక్తి కాదు.. ఆయనొక వ్యవస్థ అని కొనియాడారు. అందరికీ ప్రజా చైతన్యం అనగానే గుర్తుకు వచ్చే మొదటి పేరు గద్దర్ అని తెలిపారు. నిరంతరం ప్రజల పోరాటంలోనే బతికిన వ్యక్తి గద్దర్ అని.. ప్రాథమిక హక్కులు, పేదల హక్కుల రక్షణ కోసం ప్రత్యేక పంథాను ఎంచుకున్నారని వివరించారు.
Gaddar life : వెయ్యిడప్పులు, లక్షగొంతుల కలయిక
"ఈరోజు ప్రజా చైతన్యంలో ఎవరైనా గుర్తుకు వస్తారంటే.. చరిత్రలో మొదటగా గుర్తుకు వచ్చే వ్యక్తి గద్దర్. ఆయన పాట, చేసిన కృషి చూస్తే ఎక్కడికి పోయినా పేద వాళ్ల సమస్యల పైన, పేదల హక్కుల పైన రాజీలేని పోరాటం చేసిన వ్యక్తి గద్దర్. నిరంతరం పోరాటంలోనే బతికిన వ్యక్తి గద్దర్. నేను 40 ఏళ్లు ఆయన్ను చూశాను. మేము రాజకీయాల్లో ఉండి ప్రజల చైతన్యంపై పోరాడితే.. ఆయన పాటతో పేద ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారు. ఎన్నో పోరాటాలకు నాంది పలికారు. ఎన్నో ఆవిష్కరణలు చేశారు. తెలంగాణ పోరాటంలో కూడా ప్రముఖ పాత్ర పోషించారు."- నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ అధినేత