Chandrababu Suffering from Severe Health Issues: రాజమండ్రి కేంద్రకారాగారంలో జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు... వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో (Chandrababu Health Problems) బాధపడుతున్నారు. ఏడు పదుల వయసులో ఆయనకు కంటి సమస్యలతో పాటు ఒంటిపై దద్దుర్లు నడుము కింది భాగం వరకు విస్తరించినట్లు తెలుస్తోంది. కుడి కంటికి సత్వరమే శస్త్రచికిత్స (Eye Operation for Chandrababu) చేయాలని ఎల్వీ ప్రసాద్ నేత్రవైద్యశాల నిపుణులు సూచించారు. అదే విధంగా ఆయనకు వెంటనే వివిధ రకాల వైద్య పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ వైద్యులు నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.
రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న మాజీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. చంద్రబాబుకు గతంలో కంటి వైద్యం చేసిన హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌కు చెందిన వైద్య నిపుణులు.. ఆయనకున్న కంటి సమస్యలు, చేయాల్సిన చికిత్స, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఈ నెల 21న ఓ నివేదికలో వివరించారు. చంద్రబాబుకు 'యాంగిల్ క్లోజర్ గ్లకోమా' అనే కంటి సమస్య ఉన్నట్టు 2016లో గుర్తించారు. దానికి లేజర్ చికిత్స చేశారు. ఇంట్రా ఆక్యులర్ ప్రెజర్‌ను ఎప్పటికప్పుడు.. నిర్దిష్ట కాలావధుల్లో ఆసుపత్రిలో వైద్య నిపుణులు పర్యవేక్షించాలి.
Chandrababu Health Update: "చంద్రబాబు కంటికి చికిత్స చేయాలని ప్రభుత్వ వైద్యుల నివేదిక.. కానీ.."
అలాగే ఆయనకు కంటిలో శుక్లాలు ఏర్పడినట్లు ఈ ఏడాది మే 23న గుర్తించి, జూన్ 21న ఎడమ కంటికి శస్త్రచికిత్స చేశారు. ఆ తర్వాత ఎడమ, కుడి కంటి చూపుల్లో వ్యత్యాసం ఎక్కువగా ఉన్నందున.. 3 నెలల్లో కుడి కంటి శుక్లానికి కూడా సర్జరీ చేయాలని ఎల్వీ ప్రసాద్ వైద్యులు సూచించారు. అది కూడా ఇంట్రా ఆక్యులర్ ప్రెజర్‌ను మేనేజ్ చేస్తూ, గ్లకోమా వైద్య నిపుణుల పర్యవేక్షణలో, అన్ని వసతులూ ఉన్న ఐ ఇనిస్టిట్యూట్‌లోనే చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు.