Chandrababu Speech in Mahanadu 2023: మునుపున్నెడు లేని విధంగా దాదాపు సంవత్సరం ముందు ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించి తెలుగుదేశం సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ప్రధానంగా.. మహిళలు, యువత, రైతులకు మేలు చేసేలా ప్రకటించిన పథకాలకు శ్రేణుల నుంచి విశేష స్పందన లభించింది. వచ్చే ఎన్నికల్ని కురుక్షేత్రంగా అభివర్ణించిన పార్టీ అధినేత చంద్రబాబు... ఆ యుద్ధంలో వైసీపీ కౌరవుల్ని ఓడించాలంటే, పార్టీ శ్రేణులకు బలమైన ఆయుధాలు అవసరమని చెప్పారు. మేనిఫెస్టోలో ఇప్పుడు ప్రకటించినవి.. కీలకమైన ఆయుధాలుగా తెలిపారు. ఇప్పటి నుంచే ఇంటింటికీ తీసుకెళ్లాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. భవిష్యత్తులో మరిన్ని ఆధునిక ఆయుధాలూ అందజేస్తామని తెలిపారు.
సమర శంఖం పూరించిన చంద్రబాబు: త్వరలో జరిగే కురుక్షేత్ర యుద్ధానికి ఇక్కడి నుంచే శంఖం పూరిస్తున్నానంటూ.. చంద్రబాబు స్వయంగా శంఖం ఊదారు. మండు వేసవిలో రోహిణీ కార్తెలో రోళ్లు పగిలేలా ఎండలు కాస్తున్నా రాజమహేంద్రవరంలో జనం వరదలా పోటెత్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి రాజమహేంద్రవరానికి జనం గోదావరి వరదలా తరలి వచ్చారు. సరిగ్గా సభ మొదలయ్యేసరికి.. పెనుగాలులు, ఉరుములు, మెరుపులతో వచ్చిన భారీ వర్షం పడ్డా.. జనం కదలకుండా కూర్చున్నారు. సభ ముగిశాకే అక్కడి నుంచి కదిలారు.
"రాష్ట్రంలోని మహిళలకు, రైతులకు, యువతకు మంచి కానుకలు ప్రకటించారు. మహిళలకు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం, ఆర్థిక భరోసా కల్పించే విధంగా నెలకు 1500రూపాయలు ఇవ్వడం, ఇంకా మరెన్నో ప్రతి ఒక్కరికి కూడా రాజకీయంగా ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. అలాగై రైతుల కోసం తీసుకొచ్చిన పథకం కూడా బాగుంది"-మహిళలు