తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Chandrababu Quash Petition in Supreme Court : 'ప్రజా ప్రతినిధులపై ప్రతీకార చర్యలు ఉండొద్దు'.. చంద్రబాబు క్వాష్​ పిటిషన్​పై సుప్రీంకోర్టులో వాడీవేడిగా వాదనలు - చంద్రబాబు

Chandrababu Quash Petition in Supreme Court : చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. స్కిల్‌ డెవలప్మెంట్‌ ప్రాజెక్టులో సీఐడీ తనపై నమోదు చేసిన కేసు అక్రమమని పేర్కొంటూ.. దాన్ని కొట్టివేయాలని చంద్రబాబు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం వాదనలు విన్న ధర్మాసనం.. విచారణను నేటికి వాయిదా వేసింది. ఇవాళ ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.. విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

chandrababu_quash_petition
chandrababu_quash_petition

By ETV Bharat Telugu Team

Published : Oct 10, 2023, 3:42 PM IST

Chandrababu Quash Petition in SC : చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. జస్టిస్ అనిరుద్ధ బోస్‌, జస్టిస్ బేలా ఎం. త్రివేదితో కూడిన ధర్మాసనం పిటిషన్‌ను విచారించింది. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు హరీష్‌ సాల్వే.., సీఐడీ తరఫున ముకుల్‌ రోహత్గీ వినిపించారు. ఇవాళ్టి వాదనల్లో... విచారణ విధానంపై ఇరుపక్షాల న్యాయవాదులు భిన్నవాదనలు వినిపించారు. నోటీసులు జారీ చేయాలన్న రోహత్గీ వాదనలను హరీష్‌ సాల్వే తోసిపుచ్చారు. సుప్రీంకోర్టు విధివిధానాలను.. ఇరుపక్షాల న్యాయవాదులు బెంచ్‌ ముందు ఉంచారు. నోటీసులు ఇస్తారా అనే విషయాన్ని బెంచ్‌ తేల్చాలని రోహత్గీ కోరగా.. కొత్తగా నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని హరీష్‌ సాల్వే చెప్పారు. హైకోర్టులో దాఖలు చేసిన పత్రాల ఆధారంగానే వాదనలు జరుగుతున్నప్పుడు కొత్త డాక్యుమెంట్లు అవసరం ఉండదని.. జస్టిస్‌ త్రివేది స్పష్టం చేశారు. క్రిమినల్‌ కేసుల్లో మళ్లీ కౌంటర్‌ అఫిడవిట్ల అవసరమేంటని హరీష్‌ సాల్వే ప్రశ్నించారు. నోటీసులు ఇవ్వడం కోర్టు విధానాల్లో భాగమని.. అలా కాకపోతే మళ్లీ మొదటికొస్తుందని రోహత్గీ అన్నారు. నోటీసులు అవసరం లేదన్న విధివిధానాలపై మీ వద్ద ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని జస్టిస్ త్రివేది... హరీష్‌ సాల్వేను ప్రశ్నించారు. గతంలో వచ్చిన తీర్పులను బెంచ్ ముందు ఉంచుతామని సాల్వే బదులిచ్చారు.

17A చట్ట సవరణ ప్రధాన ఉద్దేశం అవినీతిని నిరోధించడమేనని హరీష్‌ సాల్వే ధర్మాసనానికి వివరించారు. అనినీతి నిరోధంతో పాటు ప్రజాప్రతినిధులపై ప్రతీకార చర్యలు ఉండకూడదన్నది కూడా ప్రధానమేనని చెప్పారు. 17-A చట్ట పరిధిలోని అంశాలను హరీష్‌ సాల్వే సుప్రీంకోర్టు ముందు ఉంచారు. చట్టం, సవరణలను అన్వయించడానికి అనేక ఉదాహరణలను సాల్వే బెంచ్‌ ముందు ఉంచారు. యశ్వంత్‌ సిన్హా కేసులో... రఫేల్‌ కొనుగోళ్లు (Rafale purchases) అనంతరం దాఖలైన కేసులపై వచ్చిన తీర్పులను సాల్వే ఉదహరించారు. రఫేల్‌ కేసులో జస్టిస్ కె.ఎం.జోసెఫ్‌ తీర్పును సాల్వే ఉదహరించారు. రఫేల్‌ కొనుగోళ్లపై... 2019లో యశ్వంత్‌సిన్హా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లను జస్టిస్‌ కె.ఎం. జోసెఫ్‌ కొట్టివేసిన విషయాన్ని గుర్తు చేశారు. రఫేల్‌ కేసు ఆరోపణలు 2016కు సంబంధించినవని.. .2019లో యశ్వంత్‌ సిన్హా పిటిషన్లపై తీర్పులు వచ్చాయని... సాల్వే గుర్తు చేశారు. చట్ట సవరణకు ముందున్న ఆరోపణలను పరిగణనలోకి తీసుకునే... 2019లో కేసు కొట్టివేశారని సాల్వే వివరించారు.

Chandrababu PT Warrants Hearing in ACB Court: చంద్రబాబు పీటీ వారెంట్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో తీవ్ర వాదోపవాదాలు

1988 అవినీతి నిరోధక చట్టం ప్రకారం... పోలీసులకు ఇన్వెస్టిగేషన్‌ జరిపే హక్కు ఉండదని.. ఇన్వెస్టిగేషన్‌ (Investigation) అనేది పోలీసుల బాధ్యత మాత్రమేనని... హరీష్‌ సాల్వే కోర్టుకు తెలిపారు. అన్ని రకాల విధుల్లోని ప్రభుత్వ అధికారులకు 17-Aతో రక్షణ లభించిందని చెప్పారు. ఈ క్రమంలో వివిధ రాష్ట్రాల హైకోర్టుల తీర్పులను.. సాల్వే ప్రస్తావించారు. పూర్వ అంశాలకు కూడా వర్తించేలా ఆర్టికల్ 20 (1)పై వచ్చిన తీర్పును ఉదహరించారు. చట్టసవరణ ముందు ఉన్న అంశాలకూ క్రిమినల్‌ ప్రొసీజర్ కోడ్‌లో వచ్చిన మార్పులను పరిగణనలోకి తీసుకోవచ్చని సాల్వే చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నప్పుడు మిగిలిన హైకోర్టుల తీర్పుల ప్రస్తావన అవసరం లేదని... జస్టిస్ అనిరుద్ధబోస్ అన్నారు. ఈ పరిణామాలన్నింటి ప్రకారం కేసు నమోదుకు గవర్నర్‌ ముందస్తు అనుమతి తప్పనిసరి అని.. సాల్వే కోర్టుకు చెప్పారు. చంద్రబాబుపై ఆరోపణల విచారణకు ముందే గవర్నర్ అనుమతి తప్పనిసరని అన్నారు.

ఈ సందర్భంగా... 2011 దేవిందర్‌ పాల్‌సింగ్‌ బుల్లర్‌ కేసును హరీష్‌ సాల్వే సుప్రీంకోర్టు ముందు ప్రస్తావించారు. అసలు కేసు ప్రారంభం చట్ట నిబంధనలకు అనుగుణంగా లేకపోతే... తర్వాతి పరిణామాలేవీ చట్టబద్ధం కావని బుల్లర్‌ కేసులో తీర్పు ఉందని వివరించారు. ప్రారంభం చట్టబద్ధం కానప్పుడు... కేసు మూలాన్నే తిరస్కరించాల్సి ఉంటుందని సాల్వే పేర్కొన్నారు. ఈ కేసు మూలంలోనే దోషం ఉంది కాబట్టి... బుల్లర్ కేసును పరిగణనలోకి తీసుకోవాలని బలంగా కోరుతున్నట్లు... సాల్వే కోర్టుకు తెలిపారు. చంద్రబాబుపై నమోదైన FIRనే తాను సవాల్‌ చేస్తున్నట్లు సాల్వే అన్నారు. అన్నీ కలిపేసి.. ఒక FIRను రూపొందించారని... దాన్నే తాను సవాల్‌ చేస్తున్నానని సాల్వే స్పష్టం చేశారు. చంద్రబాబు కేసులో FIR చట్టబద్ధం కాదన్నారు. FIRలో చంద్రబాబు పేరు ఎక్కడా లేదని సాల్వే పేర్కొన్నారు. డిజైన్‌ టెక్‌ సంస్థ (Design Tech Company)కు లబ్ధి చేకూర్చడం కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనేది ప్రధాన అభియోగమని... సాల్వే గుర్తుచేశారు. టెక్నాలజీ భాగస్వామికి ఆయాచిత లబ్ధి కల్పించాలన్నదే ప్రధాన ఉద్దేశమని... FIRలో ఆరోపించారని తెలిపారు. 164 సెక్షన్ కింద తీసుకున్న వాంగ్మూలం ఆధారంగా కేసును నిర్మించారని.. దాన్ని తాము ఛాలెంజ్‌ చేస్తున్నట్లు సాల్వే తేల్చిచెప్పారు.

Chandrababu Quash Petition Hearing in SC: 17ఎ వర్తించేలా కనిపిస్తోంది.. స్కిల్‌ డెవలప్​మెంట్ కేసులో సుప్రీం వ్యాఖ్య

సీఐడీ తరఫున వాదనలు వినిపించిన ముకుల్‌ రోహత్గీ... 2018కి ముందు కొనసాగిన విచారణ... కొంతవరకు సాగి నిలిచిపోయిదని... అంతమాత్రాన విచారణ జరగలేదని కాదన్నారు. 2018 మేలో మెమో దాఖలు చేశారని... దాంట్లో తగిన వివరాలు ఉన్నాయని రోహత్గీ తెలిపారు. మెమోకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ బెంచ్‌ ముందు ఉంచుతున్నామన్నారు. వాదనలు జరుగుతున్నప్పుడు 400 పేజీల బండిల్‌ను హైకోర్టు బెంచ్‌ ముందు ఉంచారని... తాము కూడా అదే రోజు అవసరమైన డాక్యుమెంట్లను కోర్టు ముందు ఉంచామని తెలిపారు. 2018 చట్టసవరణ తర్వాత చంద్రబాబును FIRలో చేర్చినప్పటికీ దీన్ని రాజకీయ ప్రతీకార చర్యగా చూడకూడదని రోహత్గీ అన్నారు. చంద్రబాబుపై తగినన్ని ఆధారాలు దొరికిన తర్వాత 2021లో కేసు నమోదు చేశారన్నారు. కేసులో చంద్రబాబును ఎప్పుడు చేర్చినప్పటికీ కేసు విచారణ కొనసాగుతున్నట్లే పరిగణించాలని రోహత్గీ కోర్టును కోరారు. చట్టసవరణకు ముందున్న నేరం కాబట్టి 17-A వర్తించదని రోహత్గీ వాదించారు.

17-A అన్నది నేరం కేంద్రంగా జరుగుతుందా? లేక వ్యక్తి కేంద్రంగా జరుగుతుందా అని జస్టిస్ త్రివేది ప్రశ్నించగా... అవినీతి నిరోధక చట్టం, IPC రెండూ కలగలసిన కేసులో... సెక్షన్‌ 4(3) ప్రకారం ప్రత్యేక జడ్జికి న్యాయపరిధి ఉంటుందని రోహత్గీ చెప్పారు. అవినీతి నిరోధక చట్టం అమలు కానప్పుడు.. మిగిలినవేవీ పరిగణనలోకి తీసుకోవద్దని.., అసలు కేసు మూలాల నుంచి కొట్టేయాలని.., పిటిషనర్‌ తరఫు న్యాయవాదులు చెబుతున్నారని జస్టిస్ త్రివేది పేర్కొన్నారు. అవినీతి నిరోధక చట్టం వర్తించనప్పుడు సెక్షన్ 420 కింద మోసపూరిత చర్యగా పరిగణనలోకి తీసుకోవాలని రోహత్గీ కోర్టుకు విన్నవించారు. అనేక రకాల నేరాలు కలగలసి ఉన్నప్పుడు స్పెషల్‌ జడ్జికి విచారణాధికారం ఉంటుందని రోహత్గీ అన్నారు. అవినీతి నిరోధక చట్టం వర్తించదు అనుకున్నప్పుడు.. ఇతర చట్టాలకు అనుగుణంగా విచారణ జరపాలని కోరారు.

Ganta Srinivasa Rao Protest Against CBN Arrest : తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు ప్రభావం ఉంటుంది : గంటా శ్రీనివాసరావు

నేరం ఎప్పుడు జరిగిందో.. అప్పటి చట్టం ప్రకారమే విచారణ జరపాలని... పరిణామ క్రమంలో చట్టంలో వచ్చిన మార్పులను పాత నేరాలకు వర్తింపచేయకూడదని... CID తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ అన్నారు. చట్టసవరణలో ఎలాంటి పరిణామాలు వచ్చాయన్నది కాకుండా... ఎప్పటి నేరానికి అప్పటి చట్టమే వర్తించాలని రోహత్గీ కోరారు. 17-A ప్రకారం ప్రిలిమినరీ ఎంక్వయిరీ చేయవచ్చని రోహత్గీ అన్నారు. 17-A ప్రకారం ఎంక్వయిరీ, ఇంక్వయిరీ, ఇన్వెస్టిగేషన్‌ దేనికీ అవకాశం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. పబ్లిక్ ఇంట్రెస్ట్‌తో నిర్ణయాలు తీసుకుని.. వ్యక్తి ప్రయోజనాలకు అవకాశం కల్పిస్తే దానికి 17-A ఎలా వర్తిస్తుందని రోహత్గీ వాదించారు. 17-A అన్నది అవినీతిని నిరోధించడం కోసమే పార్లమెంటు తీసుకొచ్చిందని... రోహత్గీ అన్నారు. భారీ ఎత్తున అవినీతి జరిగినప్పుడు అందులో ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నప్పుడు... కేవలం అధికార విధుల నిర్వహణగా పరిగణించలేమన్నారు. 17-A చట్టసవరణ అనేది నేరస్థులకు రక్షణ కవచంగా మారకూడదన్నారు. నిజాయతీపరులైన అధికారులు, ప్రజాప్రతినిధులను అనవసర భయాల నుంచి దూరం చేసేందుకే ఈ సవరణ చేశారని చెప్పారు. నేరం జరిగిన సమయంలో ఉన్న చట్టమే అమలులోకి వస్తుందంటూ గతంలో ఇచ్చిన తీర్పును రోహత్గీ (Rohatgi) ఉదహరించారు. ఒకవేళ నేరం 2012, 2013లో జరిగినా... 17-Aను రక్షణగా వాడుకుంటారా అని రోహత్గీ ప్రశ్నించారు.

ఈ క్రమంలో కలగజేసుకున్న జస్టిస్ అనిరుద్ధ బోస్‌... గతంలో 17-A చట్టసవరణ పూర్వ నేరాలకు వర్తిస్తుందా లేదా అని అడిగారు. గతంలో జరిగిన నేరాలు.. 17-A పరిధిలోకి రావని రోహత్గీ సమాధానమిచ్చారు. చంద్రబాబు కేసులో ఉన్న అంశాలను క్వాష్ పిటిషన్‌ ద్వారా నిర్ణయించలేమని రోహత్గీ చెప్పారు. కొత్త చట్టం ప్రకారం నేరం కాని విషయంలో FIR నమోదు చేయవచ్చా అని జస్టిస్ త్రివేది అడిగారు. FIR విషయంలో నేరం జరిగిన సమయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలనే తాము చెబుతున్నామని... రోహత్గీ కోరారు. సెక్షన్‌ 13(1)(సి), సెక్షన్‌ 13(1)(డి) 2018 చట్టసవరణ తర్వాత నేరాలే కావని జస్టిస్‌ త్రివేది చెప్పగా... ఇప్పటికే జరిగిన నేరంలో పాత చట్టం ప్రకారం FIR చేయవచ్చని రోహత్గీ బదులిచ్చారు. నేరం జరిగి ఉన్నప్పుడు FIR నమోదుకు ఏ చట్టం నిరోధించలేదన్నారు. అనంతర క్రమంలో ఆ సెక్షన్‌ తొలగించినప్పటికీ.. FIR నమోదు చేయవచ్చని రోహత్గీ చెప్పారు. FIR ఎలా చేయవచ్చో.. దాన్ని బలపరిచేదేమైనా మీ వద్ద ఉందా అని జస్టిస్ త్రివేది ప్రశ్నించగా... శంభునాథ్‌ కేసును రోహత్గీ ఉదహరించారు. ఈ క్రమంలో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణకు విరామమిచ్చిన సుప్రీంకోర్టు... భోజన విరామం వాదనలు కొనసాగించింది. వాదనలు తిరిగి ప్రారంభం కాగానే... క్వాష్ పిటిషన్ పై విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు వాదనలు వింటామని వెల్లడించింది.

High Court on Chandrababu Bail Petitions: డీమ్డ్ కస్టడీగా పరిగణించలేం.. చంద్రబాబు బెయిలు పిటిషన్లను కొట్టేస్తూ హైకోర్టు తీర్పు

ABOUT THE AUTHOR

...view details