CBN, Pawan Meet With CEC : రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది. విజయవాడలో జరిగిన ఈ సమావేశంలో సీఈసీ రాజీవ్‌కుమార్, ఎన్నికల కమిషనర్లు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధత, ఓటర్ల తుది జాబితాపై సీఈసీ సమీక్ష నిర్వహించింది. ఈ సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్, అధికార వైఎస్సార్సీపీ తరఫున ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి సహా సీపీఎం, బీజేపీ, బీఎస్పీ, ఆప్ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓటరు జాబితాలో చోటుచేసుకున్న అవకతవకలు, అధికార పార్టీ అరాచకాలపై సీఈసీకి చంద్రబాబు, పవన్ ఫిర్యాదు చేశారు.
'ఏపీలో ప్రజాస్వామ్యం అపహాస్యం - ఒక్క దొంగ ఓటు ఉన్నా వదిలేది లేదు' 'శాసన నియమం- న్యాయవ్యవస్థ పాత్ర'పై సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రతినిధుల సమావేశం
అరాచకాలన్నింటినీ సీఈసీ దృష్టికి తీసుకెళ్లాం ఏపీలో ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతోందని, రాష్ట్రంలో ఎప్పుడూ లేని అరాచకాలు జరుగుతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో కేంద్ర ఎన్నికల సంఘంతో సమావేశం అనంతరం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో కలిసి చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఓటరు జాబితాలో అవకతవకలపై సీఈసీకి ఫిర్యాదు చేశామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేని అరాచకాలు జరుగుతున్నాయని, రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పరిస్థితి దాపురించిందన్నారు. ప్రజల్లో తిరుగుబాటు చూసి నకిలీ ఓట్లు చేర్చేందుకు కుట్రచేస్తున్నారన్న చంద్రబాబు ఎన్నికల విధులకు అనుభవం ఉండే వ్యక్తులను నియమించుకోవాలని అన్నారు. ఎన్నికలను అపహాస్యం చేసేలా సచివాలయ సిబ్బంది, వాలంటీర్లను విధుల్లో ఉంచుతారా? అని నిలదీశారు. బీఎల్‌వోలుగా 2600 మంది మహిళా పోలీసులను పెట్టారని గుర్తుచేశారు.
అక్రమ కేసులు టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలపై 6నుంచి 7 వేల కేసులు అక్రమంగా పెట్టారని, ఒక్క పుంగనూరు కేసులోనే 200 మందికి పైగా జైలుకు వెళ్లి వచ్చారని చంద్రబాబు తెలిపారు. ఎన్నికల్లో ఎవరినీ పనిచేయకుండా చేసేందుకే అక్రమ కేసులు బనాయించారని, రాష్ట్రంలో జరుగుతున్న అన్ని అరాచకాలను సీఈసీకి చెప్పామని వివరించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా అన్ని చర్యలు తీసుకుంటామని సీఈసీ చెప్పిందని చంద్రబాబు వెల్లడించారు. అవసరమైతే కేంద్ర పోలీసు పరిశీలకులను పంపాలని, స్పెషల్ సెల్ పెట్టాలని కోరారు. ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం కోసం మా ప్రయత్నాలన్నీ చేస్తామని చెప్పారు. ఒక్క దొంగ ఓటు ఉన్నా వదిలేదని, ఈసీ దృష్టికి తీసుకెళ్లేలా పనిచేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ఉద్ఘాటించారు.
ఎన్నికల అధికారుల నిర్లక్ష్యంతో ఓటు హక్కును కోల్పోతున్న ప్రజలు - ఏపీ ఓటరు జాబితాపై ఫిర్యాదులు
చంద్రబాబు అన్నీ వివరించారు :ప్రతి నియోజకవర్గంలో నమోదవుతున్న దొంగఓట్లపై సీఈసీకి ఫిర్యాదు చేశామన్న పవన్ కల్యాణ్ సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు అన్ని అంశాలు సీఈసీకి వివరించారని వెల్లడించారు. ఏపీలో ఎన్నికలు ప్రజాస్వామ్య బద్ధంగా జరగాలని సీఈసీ నిర్ణయం తీసుకుందని, ఆ క్రమంలోనే సీఈసీ బృందం విజయవాడ వచ్చి సమావేశం ఏర్పాటు చేసిందని తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గంలో దాదాపు లక్ష పైచిలుకుదొంగ ఓట్లు నమోదయ్యాయన్న పవన్ అందులో కొన్ని ఆమోదం కూడా పొందాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి నియోజకవర్గంలో నమోదవుతున్న దొంగఓట్లపై సీఈసీకి ఫిర్యాదు చేశామని, వైసీపీ అధికారంలోకి వచ్చాక అక్రమ కేసులు పెరిగిపోయాయని చెప్పారు. దొంగ ఓట్లపై చర్యలు తీసుకోవాలని సీఈసీకి ఫిర్యాదు చేశామని జనసేన అధినేత పవన్ వెల్లడించారు.
రెండో రోజూ ముసాయిదా ఓటర్ల జాబితా ప్రత్యేక డ్రైవ్ - వైసీపీ నేతలకు రెండు, మూడేసి ఓట్లు