Chandrababu not Violated High Court Conditions:స్కిల్ కేసులో మధ్యంతర బెయిలుపై జైలు నుంచి విడుదలైన తెలుగుదేశం అధినేత చంద్రబాబు కోర్టు షరతులను ఎక్కడా ఉల్లంఘించలేదని హైకోర్టు తేల్చిచెప్పింది. చంద్రబాబు ఇంటి వద్ద కార్యకలాపాల పరిశీలనకు ఇద్దరు డీఎస్పీల్ని అనుమతించాలన్న సీఐడీ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ప్రజలు పలకరిస్తే స్పందించడం సహజమన్న న్యాయమూర్తి.. చంద్రబాబు వద్దకు వెళ్లొద్దంటూ ప్రజలను ఆదేశించబోమని స్పష్టం చేశారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మధ్యంతర బెయిల్పై విడుదలైన చంద్రబాబుకు అదనపు షరతులు విధించాలని సీఐడీ వేసిన అనుబంధ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. చంద్రబాబు మీడియా సమావేశాలు నిర్వహించకుండా, రాజకీయ ర్యాలీలలో పాల్గొనకుండా అడ్డుకోవాలని.. ఇద్దరు డీఎస్పీ స్థాయి అధికారులు ఆయన రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షించి హైకోర్టుకు నివేదికలు ఇచ్చేలా ఆదేశాలివ్వాలని కోరింది.
ఏఐజీ ఆస్పత్రి నుంచి చంద్రబాబు డిశ్చార్జి - కుడి కంటికి ఆపరేషన్ అవసరమన్న నేత్ర వైద్యులు
పలకరించేందుకు వచ్చిన వారిని ఆపలేరు కదా: సీఐడీ అనుబంధ పిటిషన్ను విచారణ జరిపిన న్యాయమూర్తి కోర్టు ముందున్న ఆధారాలను పరిశీలిస్తే జైలు నుంచి విడుదలయ్యాక చంద్రబాబును పలకరించేందుకు అనేక మంది ప్రజలు వచ్చినట్లు కనిపిస్తోందన్నారు. తనను చూసేందుకు వచ్చేవారిని చంద్రబాబు నిరోధించలేరనే విషయాన్ని గుర్తించాలని వ్యాఖ్యానించారు. కోర్టు ఆదేశాలను చంద్రబాబు ఉల్లంఘించారని చెప్పడానికి సాక్ష్యాధారాలు లేవన్నారు.
అధికార పార్టీ ప్రోద్బలంతో సీఐడీ కేసు: అనారోగ్య కారణాల దృష్ట్యా చంద్రబాబుకు మధ్యంతర బెయిలు ఇవ్వడాన్ని ‘కస్టోడియల్ బెయిల్’తో సమానంగా చూడలేమన్నారు. చంద్రబాబు ఇంటివద్ద కార్యకలాపాల పరిశీలనకు ఇద్దరు డీఎస్పీలను అనుమతించడమంటే గోప్యత హక్కును హరించడమేనన్న చంద్రబాబు తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలో బలం ఉందన్నారు. చంద్రబాబుపై రాజకీయ ప్రతీకారం తీర్చుకోవడానికై అధికార వైసీపీ ప్రభుత్వం.. ప్రోద్బలంతోనే సీఐడీ కేసు పెట్టిందని ఆయన వాదించారు. రాబోయే ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా అడ్డుకోవాలని ప్రభుత్వం యోచిస్తోందని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారని గుర్తు చేశారు.