తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ముగిసిన ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడి అంత్యక్రియలు.. పాడె మోసిన చంద్రబాబు - గన్నవరం

TDP MLC ARJUNUDU: టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడి అంత్యక్రియలు బందరులో ముగిశాయి. అంతిమయాత్రలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా అర్జునుడి పాడె మోశారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Mar 3, 2023, 7:27 PM IST

Updated : Mar 3, 2023, 7:34 PM IST

MLC ARJUNUDU:గుండెపోటుకు గురై నెల రోజుల పాటు మృత్యువుతో పోరాడి గురువారం కన్నుమూసిన బచ్చుల అర్జునుడు అంత్యక్రియలు ముగిశాయి. ఆంధ్రప్రదేశ్​లోని మచిలీపట్నంలో గల ఆయన స్వగృహంలో బంధువులు, కుటుంబసభ్యుల కన్నీటి మధ్య ఆయన అంతిమయాత్ర నిర్వహించారు. యాత్రలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా అర్జునుడి పాడె మోశారు. అర్జునుడి మృతి పార్టీ జీర్ణించుకోలేకపోతోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు అంత్యక్రియలు ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించారు. అంత్యక్రియల్లో పార్టీ శ్రేణులతో పాటు, అర్జునుడి అభిమానులు భారీగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన టీడీపీ అధినేత చంద్రబాబు.. అంత్యక్రియలు ముగిసే వరకు అక్కడే ఉన్నారు. అంతిమ యాత్రలో అర్జునుడి పాడెను ఆయన స్వయంగా మోశారు. చంద్రబాబు పాడె మోయడంతో టీడీపీ అభిమానులు ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యారు. బచ్చుల అమర్ హై అంటూ పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు. అంతకు ముందు అర్జునుడి స్వగృహానికి చేరుకున్న చంద్రబాబు.. కుటుంబ సభ్యులను ఓదార్చారు. పార్టీకి అర్జునుడు చేసిన సేవలను స్మరించుకున్నారు. కుటుంబానికి, స్థానిక కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం బచ్చుల భౌతికకాయానికి నివాళులు అర్పించి, అంతిమయాత్రలో పాల్గొన్నారు.

బచ్చుల అర్జునుడి అంతిమ యాత్రకు టీడీపీ శ్రేణులు భారీగా హాజరయ్యారు. ఆయన స్వస్థలం కృష్ణా జిల్లా మచిలీపట్నంతో పాటు ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్న గన్నవరం నుంచి పార్టీ కార్యకర్తలు, అభిమానులు అంత్యక్రియలకు తరలివచ్చారు. జనవరి 29న బచ్చులకు గుండెపోటు వచ్చిన నాటి నుంచి టీడీపీ నేతలు ఆయన ఆరోగ్యంపై నిత్యం ఆరా తీస్తూ.. వైద్యులతో సంప్రదింపులు జరిపారు. చికిత్స పొందుతున్న సమయంలో చంద్రబాబు కూడా ఆసుపత్రిని సందర్శించి ఆరోగ్యంపై ఆరా తీశారు. దాదాపు నెల రోజులుగా పోరాడిన అర్జునుడు.. పరిస్థితి విషమించటంతో గురువారం సాయత్రం తుదిశ్వాస విడిచారు.

గన్నవరంలో విషాద ఛాయాలు: ప్రస్తుతం గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్​గా బచ్చుల అర్జునుడు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన మృతితో గన్నవరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కార్యకర్త స్థాయి నుంచి ఎమ్మెల్సీ స్థాయి వరకు బచ్చుల అర్జునుడు ఎదిగారు. ఆయన పార్టీకి ఎనలేని కృషి చేశారని టీడీపీ నాయకులు కొనియాడారు. పార్టీ కష్ట కాలంలో ఉన్న సమయంలో ఆదుకున్నారని గుర్తు చేసుకున్నారు.

ప్రముఖుల సంతాపం: అర్జునుడు పార్థీవదేహానికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. అర్జునుడి మృతి పట్ల ముఖ్యమంత్రి జగన్​మోహన్​ రెడ్డి సంతాపం ప్రకటించారు. అర్జునుడి కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. అర్జునుడు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్​ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంతాపం ప్రకటించారు. వీరితోపాటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​, నటుడు బాలకృష్ణ, చినరాజప్ప, కొల్లు రవీంద్ర సంతాపం ప్రకటించారు. ఆలపాటి రాజా, యనమల, సోమిరెడ్డి, మాగంటి బాబు, కంభంపాటిలు సంతాపం తెలిపారు.

టీడీపీ సమావేశం వాయిదా: నేడు అమరావతిలో జరగాల్సిన టీడీపీ సమావేశాన్ని పార్టీ వాయిదా వేసింది. శుక్రవారం టీడీపీ సమావేశాన్ని నిర్వహించాలని అధిష్ఠానం ముందే నిర్ణయించగా.. బచ్చుల అర్జునుడి మృతి కారణంగా వాయిదా వేసింది. కృష్ణా, గుంటూరు జిల్లాల టీడీపీ సమావేశాలనూ వాయిదా వేశారు.

పాడె మోసిన చంద్రబాబు

ఇవీ చదవండి :

Last Updated : Mar 3, 2023, 7:34 PM IST

ABOUT THE AUTHOR

...view details