TDP chief Chandrababu Naidu harsh comments on CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రులపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో జగన్ మోహన్ రెడ్డి క్షమించరాని నేరం చేశాడని చంద్రబాబు ఆరోపించారు. ఇప్పటికైనా చేసిన తప్పును ఒప్పుకుని చెంపలేసుకుంటే.. ఆ భగవంతుడైనా క్షమిస్తాడని హితవు పలికారు. అంతేకాకుండా, పోలవరంపై సిగ్గులేకుండా మరోసారి రంకెలేస్తే ఇక వాతలు పెట్టడం తప్ప మరో మార్గం లేదని హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్ట్ పట్ల వైఎస్సార్సీపీ పాలకులు పేకాటలో జోకర్ మాదిరి వ్యవహరించారన్న చంద్రబాబు.. పోలవరం ప్రాజెక్టుపై జగన్ రెడ్డి, మంత్రులు వ్యవహరించిన వీడియోలను చంద్రబాబు ప్రదర్శించారు.
సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై చంద్రబాబు యుద్ధభేరి.. ఆగస్టు 1వ తేదీ నుంచి నారా చంద్రబాబు నాయుడు 'సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి' పేరుతో పర్యటన ప్రారంభించారు. పర్యటనలో భాగంగా ఆయన మొదటగా రాయలసీమలో పర్యటించి.. పలు ప్రాజెక్టుల పనులను పరిశీలించారు. అనంతరం పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ప్రాజెక్టులకు జరుగుతున్న అన్యాయాన్ని, జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, పెట్టిన ఖర్చుల వివరాలను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించిన చంద్రబాబు.. చింతలపూడి ఎత్తిపోతల పథకం, పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల స్థితిగతులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
జగన్ మూర్ఖత్వంతో డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది.. ''జగన్ మోహన్ రెడ్డి జాతి ద్రోహం చేసి, తీవ్ర అన్యాయం చేశారు. చేతకాని తనం వల్ల రాష్ట్రం మునిగిపోవటం మన దౌర్భాగ్యం. లైఫ్ లైన్ ప్రాజెక్టును విషాదం చేశారు. పుంగనూరులో ప్రజా తిరుగుబాటు చూసే పోలవరం వరకు అనుమతించారు. ప్రజా తిరుగుబాటుకు ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. జగన్ మూర్ఖత్వంతోనే పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. ఐఐటీ హైదరాబాద్ నివేదిక ప్రకారం.. పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతినటానికి 14 కారణాలలో ఒక్క కొవిడ్ మినహా మిగిలిన 13 కారణాలు వైసీపీ వైఫల్యాలే. గతంలోనూ పోలవరాన్ని ఆపడానికి జగన్ ఎన్నో ప్రయత్నాలు చేశారు. 3 గ్రామాలు అప్పగించే సమయంలో అడ్డుకునే కుట్రలు పన్ని కేసులు పెట్టించారు. కేంద్రం ఆమోదించకుండా దిల్లీలో లాబీయింగ్ చేశాడు. అబద్ధాలతో పోలవరం మీద పుస్తకాలు ప్రచురించారు. ఈ నాలుగేళ్లలో ఒక్క ఆరోపణ కూడా నిరూపించలేకపోయారు. తెలుగుదేశం హయాంలో పోలవరం నిర్మాణంలో అవినీతి లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది.'' అని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.