Chandrababu Arrest in Nandyala : తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఆంధ్రప్రదేశ్ CID అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థకు సంబంధించిన కేసులో అదుపులోకి తీసుకుంటున్నట్లు ఆయనకు నోటీసులు (CID Notices to Chandrababu Naidu) ఇచ్చారు. కేసుకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలు సమర్పించాలని పోలీసులను చంద్రబాబు కోరారు. అందుకు సంబంధించినవివరాలు, రిమాండ్ రిపోర్టు తర్వాత ఇస్తామని CID అధికారులు చెప్పారు. ఆ వివరాలు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారని చంద్రబాబు., ఆయన తరఫు న్యాయవాదులు పోలీసులను నిలదీశారు. చంద్రబాబు ఏం తప్పుచేశారో నోటీసుల్లో లేదంటున్న న్యాయవాదులు...పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించాలని సూచించారు.
High Tension in Nandyala :రాత్రంతా హైడ్రామా : నంద్యాలలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు బస చేసిన బస్సు వద్దకు పోలీసు బలగాలు పెద్ద సంఖ్యలో వెళ్లడం ఉద్రిక్తతకు దారి తీసింది. రాత్రి నంద్యాల బహిరంగసభలో పాల్గొన్న చంద్రబాబు...RK ఫంక్షన్ హాల్ వద్ద బస చేశారు. తెల్లవారుజామున రెండున్నర గంటల ప్రాంతంలో.. అనంతపురం DIG రఘురామిరెడ్డి నేతృత్వంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. చంద్రబాబును కలవాలంటూ NSG సిబ్బందిని రఘురామిరెడ్డి కోరారు. ఈ సమయంలో కలవాల్సిన పనేంటని పక్కనే ఉన్న తెలుగుదేశం నాయకులు ప్రశ్నించారు. మీకెందుకు చెప్పాలంటూ రఘురామిరెడ్డి ఎదురు ప్రశ్నించారు. కేసుతో మీకేం సంబంధం అంటూ వాదించారు. అసలు కేసేంటో చెప్పాలంటూ తెలుగుదేశం నేతలు రఘురామిరెడ్డిని నిలదీశారు.
కేసు వివరాలపై నోరు మెదపని DIG రఘురామిరెడ్డి చంద్రబాబు బస చేసిన బస్సు తలుపుల వద్దకు దూసుకెళ్లారు. వారి తీరుపై తెలుగుదేశం నాయకులు మండిపడ్డారు. విషయమేంటో చెప్పకుండా ఎందుకు హడావుడి చేస్తున్నారని నిలదీశారు. మీడియా ప్రతినిధులు ప్రశ్నించినా రఘురామిరెడ్డి ఎదురుదాడి చేయడం తప్ప సమాధానం ఇవ్వలేదు.