Chandrababu in Gitam University Graduation Ceremony : సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం వర్సిటీలో.. కౌటిల్యా స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ సంస్థ స్నాతకోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. విధానాల రూపకల్పన, సంస్కరణలు, పాలనలో టెక్నాలజీ అంశంపై ఆయన ప్రసంగించారు. పబ్లిక్ పాలసీ గ్రాడ్యుయేషన్ స్నాతకోత్సవానికి మొదటిసారి హాజరవుతున్నానని చంద్రబాబు పేర్కొన్నారు.
ప్రజల జీవితాన్ని ప్రభావితం చేయడంలో పబ్లిక్ పాలసీ కీలకమని చంద్రబాబు వివరించారు. స్వాతంత్ర్యం వచ్చిన మొదట్లో అభివృద్ధి రేటు చాలా తక్కువగా ఉండేదని చెప్పారు. పబ్లిక్ పాలసీ సంస్థకు కౌటిల్య అనే మంచి పేరు పెట్టారని.. ఆయన పేరు నిలబెట్టేలా విద్యార్థులు రాణించాలని ఆకాక్షించారు. 25 ఏళ్ల క్రితం తాను విజన్ 2020 ప్రకటించినప్పుడు కొందరు నవ్వుకున్నారని చంద్రబాబు వెల్లడించారు.
విజన్ 420 అంటూ ఎగతాళి : కొందరు విజన్ 2020ని.. విజన్ 420 అంటూ ఎగతాళి చేశారని చంద్రబాబు అన్నారు. తన విజన్ 2020 ఇప్పుడు హైదరాబాద్ అభివృద్ధిలో కనిపిస్తోందని స్పష్టం చేశారు. ఇప్పుడు విజన్ 2047 గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని చెెప్పారు. ఎందుకంటే 2047తో దేశానికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లవుతుందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే 1978లో తాను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు తమకు జీపు ఇచ్చేవారని.. అప్పటి రోడ్లలో వాటిని నడిపేందుకు చాలా ఇబ్బందిపడాల్సి వచ్చేదని చంద్రబాబు వివరించారు.
న్యూ ఇండియాను చూస్తున్నారు : ఇప్పుడు మీరు న్యూ ఇండియాను చూస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ క్రమంలో దేశ ప్రగతిని సంస్కరణలకు ముందు.. తర్వాత.. అని చెప్పుకోవాలని వివరించారు. 2047కు మన తలసరి ఆదాయం 26,000 డాలర్లుగా ఉండాలని తెలిపారు. ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని.. మరో పాతికేళ్లలో దేశం ప్రపంచంలోనే మూడో ఆర్థిక వ్యవస్థ అవుతుందని చంద్రబాబు వెల్లడించారు.
విద్యుత్ సంస్కరణల రూపకల్పనలో కీలకపాత్ర :2047 నాటికి భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కావాలని చంద్రబాబు పేర్కొన్నారు. యువత తలచుకుంటే ఇది సాధ్యమేనని వివరించారు. విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు చాలామంది తనను హెచ్చరించారని చెప్పారు. తద్వారా తాను అధికారం కూడా కోల్పోయానని అన్నారు. దేశంలో విద్యుత్ సంస్కరణల రూపకల్పనలో తనది కీలకపాత్రని చంద్రబాబు వెల్లడించారు.