Chandrababu comments on YCP Incharges Changes: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 కోట్ల ప్రజలు వర్సెస్ సైకో జగన్ నినాదంతో జరిగే ఎన్నికల్లో వైకాపాని ఇంటికి పంపటం ఖాయమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు తేల్చిచెప్పారు. ప్రస్తుతం రాష్ట్రం పడుతున్న ఇబ్బందులకు కారణంఒక్క ఛాన్స్ పాపమే అని ధ్వజమెత్తారు. ఏపీలో మొదలైన మార్పు ఇప్పటికే చాలా స్పష్టంగా కనిపిస్తోందన్న చంద్రబాబు, నోటిఫికేషన్ వస్తే మరింతగా మారుతుందని అభిప్రాయపడ్డారు. లెక్కలు తారుమారయినందుకే 11 మందికి సీట్లు జగన్ మార్చేశాడని విమర్శించారు. మంత్రులకు.. ఎమ్మెల్యేలకు బదిలీలు ఉంటాయని ఊహించలేదన్న చంద్రబాబు, ఓ చోట చెల్లని కాసు మరో చోట ఎలా చెల్లుబాటు అవుతారని ఎద్దేవా చేశారు. దళితులు, బీసీలనే బదిలీ చేసిన జగన్, బాలినేని, ద్వారంపూడి, పెద్దిరెడ్డి, జగన్ మునుషులు, బినామీలను ఎందుకు మార్చలేదని నిలదీశారు. బీసీల మీద అంత ప్రేమ ఉంటే, అక్కడ బీసీ అభ్యర్థిని నిలపొచ్చు కదా అని ప్రశ్నించారు.
జగన్కు ఉల్లిగడ్డ, ఆలుగడ్డకు తేడా తెలియదు - రైతు కష్టాలు ఎలా తెలుస్తాయి?: చంద్రబాబు
తెలుగుదేశం అభ్యర్థుల ఎంపికపై: అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని తెలుగుదేశం అభ్యర్ధులను నిలబెడతామని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలంతా సహకరించాలని కోరుతున్నామన్నారు. జన్మభూమి రుణం తీర్చుకోవడానికి అందరూ సహకరించి, మార్పునకు నాంది పలకాలని పిలుపునిచ్చారు. వైసీపీ అభ్యర్ధులకు తాడేపల్లి ఆమోదం. తెలుగుదేశం అభ్యర్థులది ప్రజామోదమని తేల్చిచెప్పారు. ఇప్పటి వరకూ లేని సరికొత్త సాంకేతిక విధానంతో తెలుగుదేశం అభ్యర్థుల్ని ఎంపిక చేస్తామని వెల్లడించారు. వైసీపీలోని అసంతృప్తులు తమకెందుకన్న చంద్రబాబు, వారిలో మంచి వారుండి, టీడీపీలోకి వస్తామంటే పరిశీలిస్తామని చెప్పారు. అక్కడ టిక్కెట్ రాలేదని మా దగ్గరకు వస్తామంటే మాకు అవసరం లేదని తేల్చిచెప్పారు. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి త్వరగానే అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. పొత్తులో ఉన్నామని, సీట్ల సర్దుబాటు చేసుకుంటున్నట్లు తెలిపారు. మద్య నిషేధం చేయకుంటే ఓటు అడగను అని చెప్పిన జగనుకు ఇప్పుడు ఓటు అడిగే హక్కు ఎక్కడిదని నిలదీశారు.