Chandrababu Clarity on Election Alliance:ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల సందర్భంగా దిల్లీ వెళ్లిన చంద్రబాబు.. జాతీయ మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. పొత్తులు ఉండవని ఇప్పుడు చెప్పి, భవిష్యత్తులో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పొత్తులు పెట్టుకున్నా.. అప్పుడు మళ్లీ మీరే అడుగుతారని విలేకర్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తెలుగుదేశంతో పొత్తులు పెట్టుకోవడానికి బీజేపీ సుముఖంగా లేదని వైసీపీ నాయకులు అంటున్నారు కదా అని ప్రశ్నించగా అంతర్గతంగా ఏం చర్చలు జరుగుతున్నాయో వారికేం తెలుసన్నారు.
Chandrababu Comments on Election Alliance:ఎన్నికల పొత్తుల గురించి మీడియా ప్రతినిధులు పదేపదే అడిగిన ప్రశ్నకు బదులిస్తూ మీకు మసాలా కావాలి, నాకు రాష్ట్ర ప్రయోజనాలుకావాలి అని చమత్కరించారు. తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేయబోతున్నామని చంద్రబాబు చెప్పారు. అభ్యర్థుల ఎంపిక కోసం కమిటీ వేశామన్నారు. దాని సిఫారసు మేరకే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అక్కడ బీజేపీతో పొత్తు ఉంటుందా అన్న ప్రశ్నకు ఇప్పటికే సమయం మించిపోయిందన్నారు. ఏపీలో సాధ్యమైనంత ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని టీడీపీకు చాలా నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జులు లేరనడం సరికాదన్నారు. ప్రతి నియోజకవర్గంలో టికెట్ల కోసం అభ్యర్థులు క్యూలో ఉన్నారని తెలిపారు. మేం గేట్లు తెరిస్తే టీడీపీలో వైసీపీ విలీనమైపోతుందని చంద్రబాబు అన్నారు.
Atrocities of YCP leaders in AP:వైసీపీ ఆటవిక రాజ్యంతోఉత్తర కొరియాలా మారిన ఆంధ్రప్రదేశ్‌ను రక్షించడమే తమ లక్ష్యమని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ దేశ చరిత్రలో ఏ రాష్ట్రమూ సాధించని వృద్ధిరేటుతో ముందుకెళ్లిందని తెలంగాణకు హైదరాబాద్ మహానగరం ఉన్నప్పటికీ విభజన తర్వాత ఆర్థిక వృద్ధి విషయంలో ఆంధ్రప్రదేశే ముందడుగు వేసిందన్నారు. ఇప్పుడు వైసీపీ చేసిన విధ్వంసంతో ఏపీ ఉత్తర కొరియాలా మారిపోతే, హైదరాబాద్‌ను ఆదరువుగా చేసుకొని తెలంగాణ దక్షిణ కొరియాలా ముందుకెళ్లిందన్నారు. రాష్ట్ర విభజనకు మించిన విధ్వంసం.. జగన్ మోహన్‌రెడ్డి పాలనలో జరిగిందని మండిపడ్డారు. రాష్ట్రంలో దోపిడీ, దౌర్జన్యాలు, వేధింపులు తప్ప అభివృద్ధి ఊసే లేదని చంద్రబాబు దుయ్యబట్టారు. జగన్ పగ, ప్రతీకారాలతో ఏపీకి రాజధాని లేకుండా చేశారని పోలవరం నిర్మాణం నిలిపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దుష్టపాలనకు చరమగీతం పాడాలని ప్రజలు ఇప్పటికే నిర్ణయానికి వచ్చారని వచ్చే ఎన్నికల్లో జగన్ ఇంటికి పోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.