Chandrababu Cases Hearing Today: అక్రమంగా తనపై పెట్టిన స్కిల్ డెవలప్‌మెంట్ కేసును (Skill Development Case) కొట్టేయాలని కోరుతూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్.. సుప్రీంకోర్టు ముందు నేడు విచారణకు రానుంది. జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం స్కిల్ డెవలప్‌మెంట్ కేసుపై విచారణ చేపట్టనుంది. ఈ నెల 3న దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. హైకోర్టు ముందు దాఖలుచేసిన పత్రాలను తమకు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను నేటికి వాయిదా వేసింది.
నేడు సుప్రీంకోర్టులో ఈ కేసు 59వ ఐటం కింద విచారణకు రానుంది. గతంలో ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు హరీష్‌సాల్వే, అభిషేక్ మను సింఘ్వీ, సిద్ధార్థ లూథ్రా.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గీ, రంజిత్‌కుమార్ వాదనలు వినిపించారు. 2018 జులైలో అవినీతి నిరోధక చట్టంలో కొత్తగా చేర్చిన 17ఎ సెక్షన్‌ను అనుసరించి సీఎం స్థాయి వ్యక్తులపై కేసు నమోదు చేసేటప్పుడు గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి అని చంద్రబాబు తరఫు న్యాయవాదులు తెలిపారు. 2021 సెప్టెంబరు 7న స్కిల్ సంస్థ ఎండీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ పోలీసులు డిసెంబరు 9న కేసు నమోదు చేశారని, అందువల్ల దీనికి గవర్నర్ ముందస్తు అనుమతి తప్పనిసరి అని వాదించారు.
Crucial Monday in Chandrababu Cases: చంద్రబాబుకు కీలక సోమవారం.. టీడీపీ శ్రేణులలో తీవ్ర ఉత్కంఠ
అయితే ఈ కేసు విచారణ 2018లో 17ఎ సెక్షన్ రాకముందే ప్రారంభమైనందున గవర్నర్ అనుమతి అవసరం లేదని.. ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదించారు. ఏపీ హైకోర్టు కూడా తన తీర్పులో ఇదే విషయాన్ని చెప్పిందన్నారు. అయితే ధర్మాసనం ఆ పత్రాలను తమకు సమర్పించాలని చెబుతూ కేసును వాయిదా వేసింది. రాష్ట్రప్రభుత్వ అధికారులు పత్రాలు సమర్పించారు. చంద్రబాబు తరఫు న్యాయవాదులూ అదనపు పత్రాలు సమర్పిస్తూ ఐఏ దాఖలు చేశారు. చంద్రబాబు అరెస్టై నెల రోజులు పూర్తైన నేపథ్యంలో ప్రస్తుతం అందరి దృష్టి నేడు సుప్రీంకోర్టు ఇవ్వబోయే ఆదేశాలపైనే ఉంది.