Chandrababu Bail Skill Development Case: స్కిల్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు పూర్తిస్థాయి బెయిల్ ఇచ్చిన హైకోర్టు... తీర్పులో అనేక కీలక విషయాలను ప్రస్తావించింది. కేసులో (Skill Development Case) సీఐడీ వాదనకు ఆధారాలు లేవని స్పష్టంచేసింది. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థతో ఒప్పందం చేసుకున్న సీమెన్స్, డిజైన్‌టెక్ సంస్థలు శిక్షణార్థులకు అత్యున్నత సాంకేతిక పరిజ్ఞాన్ని అందించడంలో విఫలమయ్యాయని.... సీఐడీ కచ్చితంగా చెప్పలేకపోతోందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ కేసులో ఓ నిందితుడికి బెయిల్ మంజూరు సందర్భంగా 2.13 లక్షల మంది యువత శిక్షణ పొందినట్లు, వారికి ధ్రువపత్రాలు అందజేసినట్లు, శిక్షణకు సొమ్ము ఖర్చు చేసినట్లు ఇదే హైకోర్టు గుర్తించిందన్నారు.
హవాలా మార్గంలో నిధుల మళ్లింపునకు సీమెన్స్ సంస్థ ఎండీ సుమన్ బోస్, డిజైన్‌టెక్ సీఎండీ ఖన్వేల్కర్ మధ్య 2014 డిసెంబరు 31వ తేదీ నుంచి 2016 జనవరి వరకు వాట్సప్ మెసేజ్‌ల ద్వారా కరెన్సీ నోట్ల నంబర్లు బదిలీ చేసుకున్నట్లు అదనపు ఏజీ ఆరోపించారన్న హైకోర్టు... వాస్తవానికి స్కిల్ కేసులో ఒప్పందం 2017 జూన్ 30వ తేదీన జరిగిందని గుర్తుచేసింది. అలాంటప్పుడు 2014-16 మధ్య చోటు చేసుకున్న వాట్సప్ మెసేజ్‌లకు, ఈ కేసుకు ఎలాంటి సంబంధం ఉందనే దానికి ప్రాసిక్యూషన్ వద్ద సమాధానం లేదంది. అసలు వారిద్దరి మధ్య జరిగిన చాటింగ్‌లకు, చంద్రబాబుకు ఏం సంబంధమన్న న్యాయస్థానం... ఆ సొమ్ము ఏ విధంగా అందింది, ఎందుకోసం లావాదేవీలు జరిపారనే విషయాన్ని ఆ మెసేజ్‌ల ఆధారంగా నిర్ణయించలేమని సీఐడీయే చెబుతోందని స్పష్టం చేసింది.
స్కిల్ కేసులో చంద్రబాబుకు సాధారణ బెయిల్
భాగస్వామ్యం కాని చంద్రబాబుకు ఏం సంబంధమో: శరత్ అండ్ అసోసియేట్స్ ఇచ్చిన ఫోరెన్సిక్ ఆడిట్ నివేదికపై ఆధారపడి సీఐడీ వాదనలు వినిపిస్తోందన్న హైకోర్టు... తమ వద్ద దస్త్రాలు లేవని APSSDC (Andhra Pradesh State Skill Development Corporation) చెబుతున్నదానికి భిన్నంగా ఆ సంస్థ తమకు పలు దస్త్రాలు అందజేసిందని శరత్ అసోసియేట్స్ నివేదిక పేర్కొందని గుర్తుచేసింది. మరోవైపు MOU (Memorandum of Understanding) ఎక్కడ జరిగిందనే విషయంలోనూ సీమెన్స్, డిజైన్‌టెక్ సంస్థలు చెబుతున్నదానికి విరుద్ధంగా ఫొరెన్సిక్ ఆడిట్ నివేదిక ఉందని.. ఒప్పందంలో తేదీని ప్రస్తావించకపోవడానికి అందులో భాగస్వామ్యం కాని చంద్రబాబుకు ఏం సంబంధమో ప్రాసిక్యూషన్ వివరణ ఇవ్వాలని న్యాయమూర్తి బెయిల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒప్పందంలో బ్యాంక్ గ్యారంటీ క్లాజ్‌ను చంద్రబాబు సూచనతో తొలగించారని ఆడిట్ రిపోర్టులో పేర్కొన్నారే కానీ... ఏ సాక్షి ఆ విషయాన్ని చెప్పారో కోర్టు ముందు ఉంచలేదని తెలిపారు.
ముఖ్యమంత్రిది బాధ్యత కాదు: ఎంఓయూలో సీమెన్స్ ఎండీ సౌమ్యాద్రి శేఖర్ బోస్ పేరును సుమన్ బోస్‌గా పేర్కొన్నారని, ఒప్పందంలో తేదీని ప్రస్తావించలేదని, సంతకాల్లో తేడా ఉందని.. సీఐడీ ఆడిట్ నివేదికలో పేర్కొందని హైకోర్టు తెలిపింది. ఈ వ్యత్యాసాలన్నింటికి అప్పటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎలా బాధ్యులవుతారనే విషయంపై సీఐడీ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందంది. ఆయా సంతకాల్లో వచ్చిన తేడాలను పరిశీలించి, పోల్చి చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిది కాదన్న హైకోర్టు... ఫోరెన్సిక్ ఆడిట్‌లో కనుగొన్న వ్యత్యాసాలకు చంద్రబాబుని బాధ్యుణ్ని చేయడానికి వీల్లేదని తేల్చిచెప్పింది.
అప్పటివరకు చంద్రబాబును అరెస్టు చేయొద్దు - దీపావళి తర్వాత 'స్కిల్ కేసు'పై తీర్పు : సుప్రీంకోర్టు
నిధుల మళ్లింపు నిజమనుకుంటే విద్యార్థులకు శిక్షణ ఎలా: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సీమెన్స్, డిజైన్‌టెక్ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ కేంద్రాలను ఏపీ ఆర్థికశాఖ అప్పటి కార్యదర్శి కె.సునీత, అధికారుల బృందం పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. అక్కడ ప్రాజెక్టు అమలు సంతృప్తికరంగా ఉందని, ఏపీలోనూ ఏర్పాటు చేస్తే విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని, ప్రపంచస్థాయిలో ఉద్యోగ అవకాశాలు పొందుతారని అందులో తెలిపారని స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ పీడీ ఖాతాలో ఉన్న 270 కోట్లను వెంటనే విడుదల చేయాలని నివేదిక ఇచ్చిన విషయంలో ఎలాంటి వివాదం లేదంది.
ఆర్థికశాఖ కార్యదర్శి సునీత, అధికారుల బృందం సరైన నివేదిక ఇవ్వలేదని సీఐడీ ఎలాంటి ఆరోపణ చేయడం లేదన్న హైకోర్టు.. 2 లక్షల మందికి పైగా శిక్షణ తీసుకొని, ధ్రువపత్రాలు పొందారనేది నిర్వివాదాంశమని స్పష్టం చేసింది. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల కోసం ప్రభుత్వం విడుదల చేసిన 370 కోట్లలో 241 కోట్ల నిధులను సీమెన్స్, డిజైన్‌టెక్ షెల్ కంపెనీలకు మళ్లించినట్లు సీఐడీ వాదిస్తోందన్న హైకోర్టు.. నిధుల మళ్లింపు నిజమనుకుంటే 2 లక్షల మందికి పైగా విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం సాధ్యపడుతుందా అని పిటిషనర్ ప్రశ్నిస్తున్నారని పేర్కొంది. శిక్షణ కేంద్రాలు, క్లస్టర్లలో మౌలిక సదుపాయాలు లేవని ప్రాసిక్యూషన్ సైతం చెప్పడం లేదని గుర్తుచేసింది.
'ఎన్నికల వేళ తప్పుడు కేసులు - రాజకీయ పెద్దలు చెప్పినట్లు సీఐడీ నడుస్తోంది'