Chandrababu Bail Petition Hearing Skill Development Case: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో గురువారం చంద్రబాబు తరఫున న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా (Sidharth Luthra), దమ్మాలపాటి శ్రీనివాస్ (Dammalapati Srinivas) ప్రతివాదనలు వినిపించారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారన్నారు. ఈ కేసులో చంద్రబాబును ప్రశ్నించేందుకు సీఐడీ (CID) కనీస ప్రయత్నం చేయలేదని.. నిందితులంతా ఇప్పటికే బెయిలు పొందారని వాదించారు. ప్రాసిక్యూషన్ వాస్తవాలను చెప్పకుండా న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టిస్తోందన్నారు.
35వ నిందితుడిగా ఉన్న జీవీఎస్ భాస్కర్‌కు హైకోర్టు బెయిలు నిరాకరించిందని మాత్రమే సీఐడీ చెబుతోందన్న చంద్రబాబు తరపు న్యాయవాదులు.. సుప్రీంకోర్టు బెయిలు ఇచ్చిన విషయాన్ని గోప్యంగా ఉంచుతోందన్నారు. కేసు దస్త్రాలన్నీ ఇప్పటికే సీఐడీ ఆధీనంలో ఉన్నాయని.. ఈ పరిస్థితుల్లో చంద్రబాబును కస్టడీలో ఉంచాల్సిన అవసరం లేదని వాదించారు.
అప్పటివరకు చంద్రబాబును అరెస్టు చేయొద్దు - దీపావళి తర్వాత 'స్కిల్ కేసు'పై తీర్పు : సుప్రీంకోర్టు
సీఐడీ అదనపు కౌంటరులో.. సీమెన్స్ సంస్థ అంతర్గత నివేదిక గురించి ప్రస్తావించారు. సీమెన్స్ ఎండీ సుమన్‌బోస్, అరవింద్ చిన్నప్ప అనే వ్యక్తి మధ్య జరిగిన వాట్సప్ సందేశాల గురించి చెప్పారన్నారు. ఆ సంభాషణ 2014 అక్టోబరు నుంచి 2015 మార్చి మధ్య జరిగినట్లు స్పష్టమవుతోందన్నారు. అప్పటికి స్కిల్ ప్రాజెక్టు ప్రారంభమే కాలేదని.. సీమెన్స్ అంతర్గత నివేదికలో చంద్రబాబు పేరు, ఆయన పాత్ర ప్రస్తావనే లేదన్నారు.
ఏపీఎస్‌ఎస్‌డీసీ (Andhra Pradesh State Skill Development Corporation)తో తమకు సంబంధం లేదని సీమెన్స్ సంస్థ చెప్పినట్లు అదనపు ఏజీ అంటున్నారన్న చంద్రబాబు తరపు న్యాయవాదులు.. మరోవైపు డిజైన్‌టెక్ ద్వారా సీమెన్స్‌కు 92 కోట్లు అందినట్లు శరత్ అసోసియేట్స్ ఇచ్చిన ఫోరెన్సిక్ ఆడిట్‌లో ప్రస్తావించారన్నారు. స్కిల్ ప్రాజెక్టుపై తాము త్రైపాక్షిక ఒప్పందం చేసుకున్నామని, తక్కువ ధరకు సాఫ్ట్‌వేర్ అందజేశామని సీమెన్స్ సంస్థ ప్రస్తుత ఎండీ మాథ్యూ థామస్ ఈడీకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారని గుర్తుచేశారు.
ఈ నేపథ్యంలో ఏపీఎస్‌ఎస్‌డీసీతో తమకు సంబంధం లేదని సీమెన్స్ సంస్థ చెప్పినట్లు సీఐడీ చేస్తున్న వాదనలో అర్థం లేదన్నారు. ఫోరెన్సిక్ నివేదికను లోపభూయిష్ఠంగా తయారుచేసిందున శరత్ అసోసియేట్స్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిజైన్‌టెక్ ఎండీ వికాస్ ఖాన్విల్కర్ ఐసీఏఐకి ఫిర్యాదు చేశారన్నారు. ఈ ఫిర్యాదుతో పిటిషనర్‌కు సంబంధం లేదని వాదించారు.