ఆక్సిజన్ కొరతతో కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లా ఆసుపత్రిలో 24 గంటల్లోనే 24 మంది ప్రాణాలు కోల్పోవటం కలకలం రేపుతోంది. మరో 50 మందికిపైగా కరోనా రోగులు ప్రాణవాయువు సమస్యను ఎదుర్కొంటున్నారు. ఆక్సిజన్ అందక కలబురగిలోని కేబీఎన్ ఆసుపత్రిలో నలుగురు రోగులు మరణించిన మరుసటి రోజునే ఈ ఘటన జరగటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఆక్సిజన్ కొరతపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని రోగుల బంధవులు డిమాండ్ చేశారు.
మరోవైపు.. ఈ ఘటనలో 24 మంది ఆక్సిజన్ కొరతతోనే చనిపోలేదని, ఇతర కారణాలు ఉన్నాయని చామరాజనగర్ డిప్యూటీ కమిషనర్ రవి పేర్కొన్నారు. ఈ విషయంపై దర్యాప్తు చేపట్టామని, అన్ని నిజాలు తెలుస్తాయన్నారు.
నవ వరుడు మృతి..
చామరాజనగర్ ఆసుపత్రి ఘటనలో ఓ నవ వరుడు ప్రాణాలు కోల్పోయాడు. మైసూర్ జిల్లా దొడ్డహోమ్మ గ్రామానికి చెందిన యువకుడికి రెండు నెలల క్రితం వివాహం జరిగింది. ఇటీవల కరోనా సోకగా.. ఆసుపత్రిలో చేరాడు. ఆసుపత్రిలో ఆక్సిజన్ అయిపోవచ్చిందని ఆదివారం తమ బంధువులతో వీడియో కాల్లో మాట్లాడిన మరుసటి రోజునే మరణించాడు.
'దోషులపై చర్యలు తీసుకుంటాం'
ఈ విషాద ఘటనకు కారణమైన వారిపై చర్యలు చేపడతామని జిల్లా ఇన్‌ఛార్జి, రాష్ట్ర మంత్రి సురేశ్ కుమార్ తెలిపారు. అన్ని మరణాలకు ఆక్సిజన్ సమస్య కారణం కాదని.. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. సరిపడా ఆక్సిజన్ సిలిండర్ల కోసం ఉన్నతాధికారులతో మాట్లాడినట్లు చెప్పారు.
సీఎం యడియూరప్ప విచారం..
చామరాజనగర్ ఆసుపత్రిలో 24 గంటల్లోనే 24 మంది రోగులు ప్రాణాలు కోల్పోవటంపై ముఖ్యమంత్రి యడియూరప్ప విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్‌తో మాట్లాడారు. ఆక్సిజన్ కొరతకు గల కారణాలు, సరఫరా విధానం, అధికారుల మధ్య సమన్వయం వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మైసూర్ జిల్లా కలెక్టర్ రోహిణి సింధూరి.. ఆక్సిజన్ సరఫరా కోసం ఏజెన్సీలకు ఆర్డర్ ఇచ్చినప్పటికీ రవాణా చేయలేదని సీఎంకు తెలిపారు మంత్రి. ఈ క్రమంలో.. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, సమస్యను నియంత్రించాలని మంత్రితో పాటు జిల్లా ఇంఛార్జి సురేశ్ కుమార్‌ను ఆదేశించారు యడియూరప్ప.