నూతన సాగు చట్టాల రద్దు కోసం ఉద్యమిస్తోన్న రైతులు.. ఫిబ్రవరి 6(శనివారం)న చక్కాజామ్(రాస్తారోకో) కార్యక్రమం చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. అయితే.. ఈ కార్యక్రమాన్ని శాంతియుతంగానే నిర్వహిస్తామని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) ప్రతినిధి రాకేశ్ టికాయిత్ తెలిపారు. దిల్లీలో ఈ కార్యక్రమం ఉండబోదని స్పష్టం చేశారు.
"మేం ఎప్పుడూ శాంతియుతంగానే పోరాడుతున్నాం. ఫిబ్రవరి 6 నాటి రాస్తారోకో కార్యక్రమం కూడా శాంతియుతంగానే కొనసాగుతుంది. ఇక్కడకు వచ్చి కార్యక్రమంలో పాల్గొనలేని రైతులు తమతమ ప్రాంతాల్లో రాస్తారోకో నిర్వహించాలి."
-- రాకేశ్ టికాయిత్, బీకేయూ నేత
గాజీపుర్ సరిహద్దులో పోరాడుతున్న రైతులకు ఆహారం, నీళ్లు అందతున్నాయని టికాయిత్ పేర్కొన్నారు. శాంతియుత వాతావరణంలో ప్రభుత్వంతో చర్చలు జరిపి తమ వాదనను వినిపిస్తామని తెలిపారు. తాము పంటలను పండిస్తుంటే ప్రభుత్వం మేకులను మొలిపిస్తోందని విమర్శించారు. దిల్లీ మినహా అన్ని ప్రాంతాల్లో ఫిబ్రవరి 6న నాలుగు గంటలపాటు రాస్తారోకో కార్యక్రమం ఉంటుందని టికాయిత్.. అంతకుముందు తెలిపారు.