CERT IN Warning To Android Users : ఆండ్రాయిడ్ ఫోన్లను ఉపయోగిస్తున్న వినియోగదారులకు కేంద్ర సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా (సీఈఆర్టీ-ఇన్) కీలక హెచ్చరిక చేసింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్- ఓఎస్‌లోని కొన్ని వెర్షన్లలో పలు లోపాలు గుర్తించినట్లు తెలిపింది. ఈ లోపాలను 'అత్యంత తీవ్రమైనవి'గా పేర్కొంది. వీటితో సైబర్ నేరగాళ్లు ఫోన్లలో సున్నితమైన సమాచారాన్ని చోరీ చేసే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఆండ్రాయిడ్ 10, 11, 12, 12ఎల్, 13 వెర్షన్లలో ఈ లోపాలను గుర్తించినట్లు సీఈఆర్టీ-ఇన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఫ్రేమ్‌వర్క్, ఆండ్రాయిడ్ రన్‌టైమ్, సిస్టమ్ కాంపోనెంట్, గూగుల్ ప్లే సిస్టమ్ అప్‌డేట్స్, కెర్నెల్, ఆర్మ్ కాంపోనెంట్స్, క్వాల్కమ్ క్లోజ్డ్ సోర్స్ కాంపోనెంట్స్‌లో తప్పిదాల కారణంగా ఈ సమస్యలు తలెత్తినట్లు వెల్లడించింది.
ప్రమాదం ఇలా!
పైన చెప్పిన తప్పిదాలను ఉపయోగించి సైబర్ నేరగాళ్లు మన మొబైల్ ఫోన్లలో పాస్‌వర్డ్‌లు, ఫొటోలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన డేటా వంటి తదితర సున్నితమైన సమాచారాన్ని దొంగలించే అవకాశముందని సీఈఆర్టీ-ఇన్ హెచ్చరికలు జారీ చేసింది. హ్యాకర్లు ఫోన్లపై దాడి చేసినప్పుడు.. మొబైల్‌ను వారి అధీనంలోకి తీసుకుని ప్రమాదకర సాఫ్ట్‌వేర్‌ను జొప్పించడం, డివైజ్‌ను పనికిరాకుండా చేసేందుకు ఈ లోపాలు ఉపయోగపడుతాయని పేర్కొంది.