CEO Killed Son In Goa : నాలుగేళ్ల కుమారుడిని చంపి, లగేజీ బ్యాగులో మృతదేహాన్ని తరలిస్తూ పోలీసులకు చిక్కిన మైండ్‌ఫుల్ ఏఐ సంస్థ సీఈఓ సుచనా సేఠ్ కేసులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె భర్త వెంకటరత్నం తన కుమారుడితో గడిపేందుకు కోర్టు అనుమతించడమే హత్యకు దారితీసిందని గోవా పోలీసులు తెలిపారు. 2022లో దంపతుల విడాకుల ప్రక్రియ ప్రారంభమైంది. కుమారుడు ఎవరి దగ్గర ఉండాలనే దానిపై కోర్టులో వాదనలు జరిగాయి. ఈ నేపథ్యంలో భర్త ప్రతి ఆదివారం కుమారుడితో ఉండేందుకు న్యాయస్థానం అనుమతించింది. ఈ ఉత్తర్వులు సుచనా సేఠ్‌ను తీవ్ర నిరాశకు గురిచేశాయి. అందుకే బాలుడిని చంపాలని నిర్ణయం తీసుకుందని పోలీసులు చెప్పారు. ఈ కేసులో సుచనాను మరింత విచారించేందుకు ఆమెను గోవా కోర్టు 6 రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది.
ఊపిరాడకుండా చేసి హత్య
నాలుగేళ్ల కుమారుడిని సుచనా సేఠ్ ఎలా చంపిందో పోస్టుమార్టం పరీక్షలో వెల్లడైంది. బాలుడికి ఊపిరి ఆడకుండా చేసి చంపిందని తెలిసింది. చేతితో కాకుండా టవల్ లేదా తలదిండుతో బాలుడి గొంతు నులిమినట్లు పోస్టుమార్టం పరీక్ష నిర్వహించిన హిరియుర్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం చేసిన సమయానికి 36 గంటల ముందు బాలుడు చనిపోయినట్లు చెప్పారు. బాలుడి శరీరం నుంచి రక్తం బయటకు రాలేదని, శరీరంపై ఎలాంటి గాయాలు లేవని చెప్పారు.