Centre warns states: దేశంలో కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రాలకు పలు సూచనలు చేశారు. పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న జిల్లాలపై రాష్ట్రాలు దృష్టిసారించాలని తెలిపారు. ఒమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ముప్పు రాకముందే ఆంక్షలు అమలు చేయాలని అన్నారు. ఈ ఆంక్షలు కనీసం 14 రోజులు అమల్లో ఉండేలా చూడాలన్నారు. ముఖ్యంగా రాబోయే పండగ రోజుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మరిన్ని సూచనలు ఇవే..
- పండగల వేళ ఒమిక్రాన్ వ్యాప్తిని అరికట్టేలా రాత్రి కర్ఫ్యూలను అమలు చేయాలి.
- భారీ సభలు, సమూహాలను నియంత్రించాలి.
- పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను కంటైన్‌మెంట్ జోన్లుగా పరిగణించి, అక్కడ తగిన నిబంధనలు అమలు చేయాలి.
- బాధితుల నమూనాలను ఆలస్యం చేయకుండా జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించాలి.
- జిల్లాల్లో డెల్టా, ఒమిక్రాన్ కేసుల సంఖ్యను ఎప్పటికప్పుడు పరిశీలించాలి. పాజిటివిటీ రేటు, డబ్లింగ్ రేటు ఎక్కువ ఉన్న జిల్లాలపై దృష్టిపెట్టాలి.
- ఆసుపత్రుల్లో పడకల సామర్థ్యం, అంబులెన్స్, ఇతర సదుపాయాలను అందుబాటులో ఉంచాలి.
- రాష్ట్రంలో వైరస్ పరిస్థితిని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలి. మాస్క్‌లు, భౌతికదూరం వంటి నిబంధనలు పాటించేలా ప్రజలను ప్రోత్సహించాలి.
- వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేయాలని, జాతీయ సగటు కంటే తక్కువ వ్యాక్సినేషన్ రేటు ఉన్న జిల్లాల్లో ఇంటింటి టీకా పంపిణీ కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలి.
- రాబోయే రోజుల్లో ఎన్నికలు జరిగే రాష్ట్రాలు 100 శాతం టీకా పంపిణీ పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలి.