PM fasal bima yojana 2022 : పంటల బీమా పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో మార్పులు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రీమియం మొత్తాన్ని హేతుబద్ధీకరించడంతోపాటు మరిన్ని బీమా కంపెనీలు ఇందులో భాగస్వామ్యం అయ్యేలా ఈ పథకాన్ని తీర్చిదిద్దేందుకు సిద్ధమవుతోంది. కేబినెట్ ఆమోదం మేరకు మార్పులు చేసి 2023-24 పంట సంవత్సరానికల్లా(జులై-జూన్) దీన్ని అమల్లోకి తీసుకురావాలని భావిస్తోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ బీమా పథకం ద్వారా ఇన్సూరెన్స్ కంపెనీలే లాభపడుతున్నాయని నివేదికలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆ మేర మార్పులు చేయాలని భావిస్తోంది.
2016 ఫిబ్రవరిలో ఈ పథకం ప్రారంభమైంది. పంట నష్టాల నుంచి రైతుకు రక్షణ కల్పించడమే దీని ధ్యేయం. రైతులు చెల్లించే ప్రీమియం అతి తక్కువగా ఉండేలా రాయితీలు కల్పిస్తూ పథకాన్ని రూపొందించారు. ఖరీఫ్‌లో వేసే పంటలకు రెండు శాతం, రబీలో పండించే ఆహార ధాన్యాలు, నూనె గింజల పంటలకు 1.5 శాతం చొప్పున రైతులకు నామమాత్రపు ప్రీమియం నిర్ణయించారు. వార్షిక వాణిజ్య పంటలకు వ్యవసాయదారులు చెల్లించాల్సిన గరిష్ఠ ప్రీమియం 5 శాతంగా పేర్కొన్నారు. వాస్తవ ప్రీమియం రేట్లకు రైతు చెల్లించే వాటికి మధ్య ఉండే వ్యత్యాసాన్ని కేంద్రం, రాష్ట్రం చెరి సగం భరించాలి. చివరి సారిగా 2020లో ఈ స్కీమ్‌లో కొన్ని మార్పులు చేశారు.