Armed Forces Act Withdrawal: నాగాలాండ్‌లో ఇటీవల సైన్యం చేతిలో 14 మంది పౌరుల హత్య నేపథ్యంలో.. కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న ఉద్రిక్తతలను తగ్గించడానికి.. రాష్ట్రంలో వివాదాస్పద సాయుధ దళాల(ప్రత్యేక అధికారాలు) చట్టం-1958ని (ఏఎఫ్ఎస్పీఏ) ఎత్తివేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది.
నాగాలాండ్, అసోం ముఖ్యమంత్రులు నియో ఫియు రియో, హిమంత బిశ్వ శర్మతో.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా డిసెంబర్ 23న జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
కమిటీలో ఐదుగురు సభ్యులుగా ఉంటారని.. సీఎం నియో వెల్లడించారు. కమిటీ నివేదిక ఆధారంగా ప్రత్యేక అధికారాల చట్టంపై కేంద్రం తుది నిర్ణయం తీసుకోనుందన్నారు.
కమిటీ ఏం చేస్తుంది?
- హోం మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి(ఈశాన్యరాష్ట్రాలు), సీఎస్, నాగాలాండ్ డీజీపీ, అసోం రైఫిల్స్ ఐజీ, సీఆర్పీఎఫ్ నుంచి ఓ ప్రతినిధి కమిటీ సభ్యులు.
- 45 రోజుల్లోగా ప్యానెల్ తమ ప్రతిపాదనలు, సూచనలు సమర్పించాల్సి ఉంటుంది.
- కమిటీ సిఫార్సుల మేరకు చట్టాన్ని తొలగించాలా? వద్దా? అనేదానిపై కేంద్రం తుది నిర్ణయం తీసుకుంటుంది.
Nagaland Civilians Killed
డిసెంబర్ 5న మిలిటెంట్ల వేటకు వెళ్లిన భారత బలగాలు మోన్ జిల్లా ఓటింగ్ వద్ద బొగ్గు గనిలో విధులు ముగించుకుని వెళ్తున్న కార్మికులపై కాల్పులు జరిపాయి. దీంతో 14 మంది మృతి చెందారు. మరో 11 మంది పౌరులకు తీవ్రగాయాలయ్యాయి.
భద్రతా బలగాలు పౌరులపైనే కాల్పులు జరపడం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. పౌరుల మరణాలు సంభవించినప్పటినుంచి వివాదాస్పద చట్టాన్ని ఉపసంహరించుకోవాలని పౌరులు వివిధ ప్రాంతాల్లో తీవ్ర నిరసనలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే కేంద్రం ఇప్పుడు కమిటీ ఏర్పాటుకు ఉపక్రమించింది.
మృతుల కుటుంబాల్లో ఒక్కొక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనుంది నాగాలాండ్ సర్కార్.