తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Pegasus Spyware: పెగసస్​పై​ సుప్రీం మధ్యంతర ఉత్తర్వులు!

పెగసస్​(Pegasus Spyware) వ్యవహారంపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వు చేసింది. రెండు మూడు రోజుల్లో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని పేర్కొంది. ఈలోగా కేంద్రం మనసు మార్చుకుని మరో అఫిడవిట్ సమర్పించాలనుకుంటే తమ ముందు ఉంచవచ్చని స్పష్టం చేసింది.

SC
సుప్రీంకోర్టు

By

Published : Sep 13, 2021, 12:34 PM IST

Updated : Sep 13, 2021, 3:20 PM IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెగసస్‌ స్పైవేర్‌(Pegasus Spyware) వ్యవహారంపై రెండు మూడు రోజుల్లో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ అంశంపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని దాఖలైన పిటిషన్లను విచారించి తీర్పును వాయిదా వేసింది. ఈ లోగా కేంద్రం మనసు మార్చుకుని పెగసస్​పై సవివర అఫిడవిట్​​ దాఖలు చేయాలని భావిస్తే తమకు సమర్పించవచ్చని సీజేఐ జస్టిస్​ ఎన్​.వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.

వాదనలు..

అంతకుకు ముందు వాదనల సందర్భంగా పెగసస్​పై స్వతంత్ర నిపుణుల కమిటీ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్రం తరఫు న్యాయవాది సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు. దేశ భద్రత అంశాలు చర్చించడం మంచిది కాదనేది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశంగా చెప్పారు. అయితే పెగసస్‌(Pegasus Snooping) అంశం అత్యంత ముఖ్యమైనదేనన్న ఆయన.. కేంద్ర ఏర్పాటు చేసిన కమిటీ అన్నీ పరిశీలించి కోర్టుకు నివేదిస్తుందని చెప్పారు.

కేంద్ర అభిప్రాయంతో ఏకీభవించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్​.వి రమణ.. దేశభద్రత, శాంతి భద్రతల అంశాల్లోకి తాము వెళ్లడం లేదని స్పష్టం చేశారు. రక్షణ తదితర అంశాలను ధర్మాసనం అడగటం లేదన్నారు. కేంద్రం పదేపదే ఇదే విషయాన్ని ప్రస్తావించటాన్ని తప్పుబట్టారు. ప్రస్తుతం పెగసస్‌ అంశాన్ని అందరూ ఆసక్తిగా చూస్తారని జస్టిస్‌ ఎన్‌.వి రమణ అన్నారు. కాబట్టి పౌరుల హక్కుల ఉల్లంఘన జరిగిందో లేదో కేంద్రం స్పష్టం చేస్తే చాలని పేర్కొన్నారు. గోప్యతా హక్కుల ఉల్లంఘన ఆరోపణలకే పరిమితం కావాలని కేంద్రానికి స్పష్టం చేశారు.

మరోవైపు పెగసస్‌ వ్యవహారంపై(Pegasus News) వచ్చిన అన్ని ఆరోపణలను కమిటీ పరిగణనలోకి తీసుకుంటుందన్న ఎస్‌జీ తుషార్‌ మెహతా.. దీనిపై సవివరంగా మరో అఫిడవిట్‌ దాఖలు చేయాల్సిన అవసరం లేదని కోర్టుకు విన్నవించారు.

సిబల్ వాదన..

అటు కేంద్రం వాదనలను పిటిషనర్‌ తరపు న్యాయవాది కపిల్‌ సిబల్ తప్పుబట్టారు. వాస్తవాలు చెప్పబోమని ప్రభుత్వం అంటోందని ఆయన ఆరోపించారు. సాధారణ ప్రజలే లక్ష్యంగా చట్టవిరుద్ధంగా పెగసస్‌ వాడారని, పౌరులపై స్పైవేర్‌ను ఉపయోగిస్తున్నారని వాదించారు. స్పైవేర్‌ ఉపయోగించటానికి ఓ విధానం ఉండాలన్న కపిల్‌ సిబల్‌... అది లేకపోగా మేం చేయాల్సింది చేస్తామన్న విధంగా కేంద్రం తీరు ఉందని మండిపడ్డారు.

పెగసస్‌ అంశంపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా దాఖలు చేసిన పిటిషన్‌ సహా పన్నెండు వ్యాజ్యాలను సుప్రీం ధర్మాసనం విచారిస్తోంది. ఇజ్రాయెల్‌కు చెందిన స్పైవేర్ పెగసస్‌ను ఉపయోగించి దేశంలోని 300కు పైగా ప్రముఖుల ఫోన్‌ నంబర్లు హ్యాకింగ్‌కు గురైనట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం చెలరేగింది.

ఇదీ చదవండి:ఉగ్రవాదానికి చెక్ పెట్టేలా 'నాట్​గ్రిడ్' వ్యవస్థ.. త్వరలోనే...

Last Updated : Sep 13, 2021, 3:20 PM IST

ABOUT THE AUTHOR

...view details