దేశంలో కరోనా వ్యాప్తి పెరుగుతున్న రాష్ట్రాలన్నీ అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా.. తెలంగాణ సహా ఏడు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వర్చువల్ మాధ్యమంలో ఉన్నత స్ధాయి సమీక్ష నిర్వహించారు. వైరస్ వేగంగా విస్తరిస్తున్న పరిస్ధితులు ఏర్పడితే నిబంధనలు ఉల్లంఘించిన వారి పట్ల కఠినంగా వ్యవహరించడం, పటిష్ట నిఘా వంటివి అమలు చేయాలని రాజీవ్ గౌబా ఈ సందర్భంగా సూచించారు.
'కేసులు పెరుగుతున్నాయి- అప్రమత్తత అవసరం' - కేంద్రం సమీక్ష
రాష్ట్రాలు కొవిడ్ నిబంధనలను మరింత కఠినతరం చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. దేశ వ్యాప్తంగా పెరుగుతోన్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకొని ఆయా రాష్ట్రాలతో సమీక్ష నిర్వహించింది. మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు తగిన చర్యలను చేపట్టాలని కోరింది.
'జాగ్రత్తలు వహించాలి లేకుంటే కష్టమే'
గత ఏడాది పరిస్ధితులు పునరావృతం కాకుండా చూడాలని హితవు పలికారు. కరోనా పరీక్షలను సమర్థంగా నిర్వహించడం, వైరస్ సోకిన వారిని గుర్తించడం, ఐసోలేషన్‌లో ఉంచడం, వారితో దగ్గరగా మసలిన వారిని క్వారంటైన్‌లో ఉంచడం వంటివి అమలు చేయాలని గౌబా సూచించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న జిల్లాలకు వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యం ఇవ్వాలని హితవు పలికినట్లు వెల్లడించింది.