దేశవ్యాప్తంగా కరోనా టీకాను ఒకే ధరకు అందుబాటులో ఉంచాలని కోరుతూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌కు ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ లేఖ రాశారు. టీకా ధర వీలైనంత తక్కువగా ఉంచాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రానికి రూ.150కే టీకాను సరఫరా చేసిన సీరం ఇన్స్టిట్యూట్.. రాష్ట్రాలకు రూ.400, ప్రైవేట్ ఆస్పత్రులకు రూ.600గా టీకా ధరను నిర్ణయించడాన్ని తప్పుబట్టారు. కొవిషీల్డ్‌ను ప్రపంచంలోనే అత్యధిక ధరకు దేశంలో విక్రయిస్తున్నారని అన్నారు.
"దేశంలో కరోనా వ్యాప్తి పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని.. అదనపు లాభాల కోసం సీరం సంస్థ టీకా రేట్లను పెంచింది. ప్రజలు దోపిడీకి గురికాకుండా ఉండాలంటే.. వ్యాక్సిన్‌కు సాధ్యమైనంత కనిష్ఠ ధరను కేంద్రం నిర్ణయించాలి. రెండు సంస్థలే టీకా ఉత్పత్తి చేస్తున్నాయి కాబట్టి ఆరోగ్యకరమైన పోటీకి ఆస్కారం లేకుండా పోయింది."