ఉత్తర్‌ప్రదేశ్ కాన్పుర్‌లో తొలి జికా వైరస్ కేసు(zika virus in india) నమోదైన నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. పరిస్థితి చేయి దాటిపోకుండా చూసేందుకు చర్యలు చేపట్టింది. వివిధ విభాగాలకు చెందిన ఉన్నత స్థాయి నిపుణులతో కూడిన బృందాన్ని ఉత్తర్‌ప్రదేశ్‌కు పంపింది.
ఎంటోమాలజిస్టు, ప్రజారోగ్య నిపుణుడు, గైనకాలిజిస్టు, ఆర్ఎంఎల్ ఆస్పత్రి వైద్య నిపుణులు, జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్ర అధికారులు ఈ బృందంలో ఉంటారని కేంద్ర ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. వీరంతా జికా కట్టడిలో ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులకు సహకరిస్తారని చెప్పింది. వైరస్ పరిస్థితులను పర్యవేక్షిస్తారని పేర్కొంది.