డిసెంబర్ 8న భారత్ బంద్కు రైతు సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. అన్ని ప్రాంతాల్లో భద్రతను పటిష్ఠం చేయాలని సూచించింది. బంద్ జరిగినప్పటికీ శాంతియుత పరిస్థితులు కొనసాగేలా చూడాలని స్పష్టం చేసింది. అవాంఛనీయ ఘటనలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది.
అదే సమయంలో కొవిడ్ మార్గదర్శకాలు పాటించేలా చూడాలని సూచించింది కేంద్ర హోంశాఖ. భౌతిక దూరం నిబంధనలు అమలయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది.
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టిన రైతు సంఘాలు.. భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. మూడు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. భారత్ బంద్కు కాంగ్రెస్, ఎన్సీపీ, డీఎంకే, సమాజ్వాదీ పార్టీ, తెరాస, వామపక్షాలు సహా పలు పార్టీలు మద్దతిచ్చాయి.