భారత్లో కొవిడ్ నివారణకు కేంద్రం పటిష్ఠ చర్యలు చేపడుతోంది. వైరస్ వ్యాప్తిని అరికట్టడమే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కొద్దిరోజులుగా దేశంలో కరోనా కాస్త శాంతించినప్పటికీ.. కొన్ని రాష్ట్రాల్లో కేసులు విపరీతంగా వెలుగుచూస్తున్నాయి. ఆయా రాష్ట్రాలు/నగరాలు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నాయి.
కర్ఫ్యూ భయాలు..
కరోనా భయాల నేపథ్యంలో.. పలు రాష్ట్రాలు మళ్లీ కర్ఫ్యూ బాటలో పయనిస్తున్నాయి. కొవిడ్ హాట్స్పాట్లుగా ఉన్న నగరాల్లో రోజువారీ కర్ఫ్యూ విధించేందుకు సిద్ధమవుతున్నాయి.
- గుజరాత్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. అహ్మదాబాద్లో నవంబర్ 20 నుంచి ఉదయం 9-6 గంటల మధ్య రోజువారీ కర్ఫ్యూ విధించనున్నట్లు స్పష్టం చేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితి మెరుగయ్యేంత వరకు ఇది కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు.
- దిల్లీలో బహిరంగ ప్రదేశాల్లో మాస్కు తప్పనిసరి చేశారు. మాస్కు లేకుంటే విధించే జరిమానాను రూ. 2 వేలకు పెంచింది కేజ్రీవాల్ సర్కార్.
ఇదీ చూడండి:'ఇకపై మాస్క్ లేకుంటే రూ. 2వేలు కట్టాల్సిందే'
- దేశవ్యాప్తంగా బుధవారం నమోదైన కరోనా మరణాల్లో 22.39 శాతం దిల్లీ నుంచే ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. రికార్డు స్థాయిలో ఒక్కరోజే దేశ రాజధానిలో 131 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఆ రాష్ట్రాలకు కేంద్ర బృందాలు..
కరోనా తీవ్రత దృష్ట్యా.. హరియాణా, రాజస్థాన్, గుజరాత్, మణిపుర్ రాష్ట్రాల్లో పరిస్థితిని సమీక్షించేందుకు గురువారం ఉన్నత స్థాయి కేంద్ర బృందాలు తరలివెళ్లాయి. కరోనా కేసులు ఎక్కువగా వెలుగుచూస్తున్న జిల్లాల్లో సందర్శించి.. నివారణ చర్యలపై దృష్టి సారిస్తాయి.