కొవిడ్ మూడో ఉద్ధృతి తప్పకపోవచ్చన్న హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. మెరుగైన కొవిడ్ చికిత్సలను అందించేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు 'భారత కొవిడ్-19 అత్యవసర స్పందన, ఆరోగ్య వ్యవస్థల సన్నద్ధత ప్యాకేజీ (ఈసీఆర్‌పీ): రెండో దశ'లో భాగంగా 15 శాతం నిధుల్ని అంటే రూ.1,827 కోట్లను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు విడుదల చేసింది. ఈసీఆర్‌పీ-2 కింద మొత్తం రూ.23,123 కోట్ల నిధుల అందజేతకు ఆమోదం లభించిన విషయం తెలిసిందే.
వివిధ రాష్ట్రాలకు కేటాయించిన నిధుల వాటా వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుక్ మాండవీయ ట్విట్టర్ ఖాతాలో ఉంచారు. అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌కు రూ.281.98 కోట్లు కేటాయించారు. తర్వాత బిహార్‌కు రూ.154 కోట్లు, రాజస్థాన్‌కు రూ.132 కోట్లు, మధ్యప్రదేశ్‌కు రూ.131 కోట్లు ఇచ్చారు. తెలంగాణకు రూ.44.80 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.62.69 కోట్లు కేటాయించారు.
నిధుల వినియోగానికి మార్గదర్శకాలు..
ఈ నిధులతో ఆరోగ్య వసతులను మెరుగుపరచడం ద్వారా కొవిడ్‌ను సమర్థంగా నియంత్రించాలని కేంద్రం గతంలో మార్గదర్శకాలను జారీ చేసింది. కొవిడ్ పరీక్షల నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకోవాలి. బాధితులను వేరుగా ఉంచేలా కమ్యూనిటీ ఐసోలేషన్ కేంద్రాలు, కొవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేసుకోవాలి. ఉప జిల్లా/డివిజన్ స్థాయిలోని చికిత్స కేంద్రాల్లో పడకలను, పీపీఈ కిట్లు వంటి సామగ్రిని సమకూర్చుకోవాలి. అత్యవసర ఔషధాలను అందుబాటులో ఉంచుకోవాలి. ఆక్సిజన్ లభ్యతను పెంచుకోవాలి. కొద్దిపాటి లక్షణాలున్న కొవిడ్ రోగులకు, ఐసోలేషన్‌లో ఉన్నవారికి ఫోన్ ద్వారా సూచనలు అందించేందుకు.. ఎంబీబీఎస్ చివరి సంవత్సరం, పీజీ వైద్య విద్యార్థుల సేవలను పొందవచ్చు. చివరి సంవత్సరం నర్సింగ్ గ్రాడ్యుయేట్ల పూర్తిస్థాయి సేవలను ప్రభుత్వ చికిత్సా కేంద్రాల్లో వినియోగించుకోవచ్చు. ఇందుకు వారికి చెల్లించాల్సిన వేతనాలను, ఇన్సెంటివ్‌లను ఈసీఆర్‌పీ-2 నుంచి ఖర్చు చేయవచ్చు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఈ మార్గదర్శకాల్లో మార్పులు చేసుకోవచ్చు.
ఇదీ చూడండి:ప్రతిష్టంభనలతో ₹130 కోట్ల ప్రజాధనం వృథా!